Published
Wed, Aug 27 2014 1:27 AM
| Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
జన ధన యోజన.. తొలిరోజు కోటి అకౌంట్లు!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అందరికీ బ్యాంక్ అకౌంట్లు లక్ష్యంగా ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ఆగస్టు 28న అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో ఘనంగా ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. మొదటిరోజే దాదాపు కోటి అకౌంట్లు ప్రారంభమవుతాయని అంచనా. ఆధార్ అనుసంధాన అకౌంట్లకు రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, పేదవర్గాల కోసం డెబిట్ కార్డు, బీమా కవరేజీ వంటి సదుపాయాలతో బ్యాంకు ఖాతాలు అందించే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వాతంత్య్ర దినోత్సవం రోజు జన ధన యోజన పథకాన్ని ప్రకటించారు.
28వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభానికి దేశ వ్యాప్తంగా దాదాపు 76 చోట్ల భారీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పథకం (అందరికీ బ్యాంక్ అకౌంట్ల లభ్యత) గురించి ప్రధానమంత్రి ఇప్పటికే 7.25 లక్షల ఈమెయిల్స్‌ను బ్యాంక్ అధికారులకు పంపినట్లు సమాచారం.
ప్రారంభం రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 60,000కు పైగా క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ముందస్తు క్యాంప్‌ల ద్వారా ఇప్పటికే విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం విజయవంతానికి ఇప్పటికే పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటుండగా, పలు సంస్థలు సైతం ఈ దిశలో తమ సహకారం అందిస్తామని ప్రకటించాయి. ఈ ధన జన యోజన కార్యక్రమం మొదటిదశ ఈ నెల్లో ప్రారంభమై వచ్చే యేడాది ఆగస్టులో ముగుస్తుంది. రెండవదశ 2015 నుంచి 2018 వరకూ కొనసాగుతుంది.
తెలంగాణలో జన ధన యోజన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందరికీ ఆర్థిక సేవలను అందించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి జన ధన యోజన పథకాన్ని ఆగస్టు 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్రానికి స్టేట్ లెవల్ బ్యాంకర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొంటారని ఎస్‌బీహెచ్ తెలిపింది. అన్ని బ్యాంకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఖాతాదారులకు లక్ష రూపాయల ప్రమాద బీమా రక్షణతో పాటు రూపే డెబిట్ కార్డును అందచేస్తారు.