ఒక చుక్కతో ఎకరా మొత్తానికి పోషకాలు | prathista industries released of nano fertilizer | Sakshi
Sakshi News home page

ఒక చుక్కతో ఎకరా మొత్తానికి పోషకాలు

Published Sat, Aug 9 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఒక చుక్కతో ఎకరా మొత్తానికి పోషకాలు

ఒక చుక్కతో ఎకరా మొత్తానికి పోషకాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పంటలకు అవసరమైన పోషకాలను అందించడానికి కిలోల కొద్ది ఎరువులు చల్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక చుక్కతో పోషకాలను అందించే నానో ఎరువులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రతిష్ట ఇండస్ట్రీస్ ఏడు నానో ఫెర్టిలైజర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం వివరాలను తెలియచేయడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతిష్ట ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కె.వి.ఎస్.ఎస్ సాయిరామ్ మాట్లాడుతూ ఈ ఎరువులు పర్యావరణపరంగా చాలా అనుకూలమైనవన్నారు.

 రసాయన ఎరువులు వినియోగంలో వృధా అన్నది ఎక్కువగా ఉంటుందని, దీన్ని అరికడుతూ పంట దిగుబడిని పెంచే విధంగా నానో ఫెర్టిలైజర్స్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఉదాహరణకు 50 కిలోల పొటాష్‌ను వినియోగిస్తే అందులో 15 నుంచి 20 శాతం మాత్రమే మొక్క సంగ్రహిస్తుందని, మిగిలినదంతా భూమిలో ఉండి, ఆమ్లత్వం పెరిగి భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయన్నారు. ఈ నానో ఫెర్టిలైజర్స్‌తో అటువంటి ఇబ్బంది ఉండదని, ఎరువు సారమంతా  మొక్కలు తీసుకుంటాయన్నారు.

డ్రిప్ ఇరిగేషన్ విధానంలో  ఈ ఎరువులను నీటిలో కలిపి ఉపయోగించుకోవచ్చని, లేకపోతే గ్రాన్యుల్స్‌తో కలిపి వినియోగించుకోవచ్చన్నారు. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గడంతోపాటు, 10 నుంచి 15 శాతం దిగుబడి పెరుగుతుందన్నారు. ఈ జీవ నానో ఎరువులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, వీటి ఫలితాలను బట్టి మార్కెటింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని నాగార్జునా ఫెర్టిలైజర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ఎన్ భాస్కరన్ తెలిపారు. ప్రతిష్ట ఇండస్ట్రీస్‌కు చెందిన ఇతర ఉత్పత్తులను ఇప్పటికే విక్రయిస్తున్నట్లు భాస్కరన్ తెలిపారు. వచ్చే 3-5 ఏళ్లలో తమ కంపెనీ వ్యాపారం రూ. 2,500 కోట్లకు(గతేడాది రూ.210 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సాయిరామ్ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement