మన దేశంలో సామాన్యుల దగ్గరి నుంచి ధనవంతుల వరకు బాగా పరిచయమైన పెట్టుబడి సాధనం ప్రభుత్వ భవిష్య నిధి (పీపీఎఫ్). ఇందులో చేసే పెట్టుబడులు, దానిపై వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపులు ఉండటమే దీనికి కారణం. అయితే, పీపీఎఫ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా మరి!!
కాలవ్యవధి 15 ఏళ్ల పైనే..
పీపీఎఫ్ 15 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ 15 ఏళ్లకు పూర్తి కావాలి. అయితే, కాల వ్యవధిని లెక్కించేది ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి కాదు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల వ్యవధిని పరిగణిస్తారు. ఏ తేదీ, ఏ నెలలో మొదలుపెట్టారన్నది ముఖ్యంకాదు. ఉదాహరణకు 2017 జూలై 1న ఖాతా ప్రారంభించారనుకోండి. దాన్ని 2018 మార్చి 31గా లెక్కిస్తారు. అప్పటి నుంచి 15 ఏళ్ల వ్యవధికి పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో కాల వ్యవధి 2032 ఏప్రిల్ 1తో ముగుస్తుంది.
పొడిగించుకోవచ్చు...
పీపీఎఫ్ ఖాతా కాలవ్యవధి 15 ఏళ్లే అయినప్పటికీ, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఖాతాలో పెట్టుబడులపై అప్పటి వడ్డీ రేటు అమలవుతుంది. పొడిగించుకోవాలని అనుకుంటే 15 ఏళ్లు ముగిసిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పొడిగించిన కాలానికి జమలు చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు అవసరమైతే ఏడాదికోసారి బ్యాలెన్స్‌లో 60 శాతం మించకుండా వెనక్కి తీసుకోవచ్చు.
బదిలీ చేసుకోవచ్చు కూడా...
పీపీఎఫ్ ఖాతాను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఒక తపాలా కార్యాలయం నుంచి మరో తపాలా కార్యాలయానికి లేదా తపాలా కార్యాలయం నుంచి బ్యాంకుకు మార్చుకునేందుకు అవకాశం ఉంది. అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు కూడా బదిలీ చేసుకోవచ్చు.
నామినేషన్
ఖాతాకు నామినేషన్ సదుపాయం ఉంది. ఓ వ్యక్తి తన ఖాతాకు అవసరమైతే మైనర్‌ను కూడా నామినీగా అపాయింట్ చేసుకోవచ్చు. అయితే, మైనర్ తరఫున తెరిచిన ఖాతాకు నామినేషన్ సౌకర్యం లేదు.
ఖాతా తెరవటానికి అర్హులెవరు?
దేశంలో నివసిస్తున్న వారే పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు అవకాశం ఉంది. జాయింట్ పీపీఎఫ్ ఖాతాకు అవకాశం లేదు. అయితే, సంరక్షకుడితో కలసి మైనర్లు ఖాతాను ప్రారంభించొచ్చు. సంరక్షకులనే వారు తల్లి లేదా తండ్రి లేదా కోర్టు నియమించిన వేరొకరైనా కావచ్చు. తల్లిదండ్రులు మరణించిన సందర్భాల్లో తప్పిస్తే తాత, బామ్మలు మనవడు లేదా మనవరాలి పేరిట పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అవకాశం లేదు. ఒకరు తన పేరిట ఒక ఖాతాను మించి ప్రారంభించేందుకు నిబంధనలు అనుమతించవు. అయితే మైనర్ పేరిట తెరిచిన ఖాతాను వేరేగా పరిగణిస్తారు. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), హిందూ ఉమ్మడి కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) లేదా వ్యక్తులకు సంబంధించిన సంస్థ (బీఓఐ)లు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. ఇటీవలే కేంద్రం పీపీఎఫ్‌కు సంబంధించి ఎన్‌ఆర్‌ఐల విషయంలో ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరిచి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడితే (ఎన్‌ఆర్‌ఐగా మారితే) వారి పీపీఎఫ్ ఖాతా మూసివేతకు గురవుతుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై కేవలం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. అంటే 7.8 శాతం వడ్డీ రేటు వర్తించదు.
నగదు అవసరమైతే...
పెట్టుబడి ప్రారంభించిన తర్వాత 15 ఏళ్ల వ్యవధి తీరకుండానే డబ్బుతో పని పడిందనుకోండి. పెట్టుబడుల్లో కొంత వెనక్కి తీసుకోవచ్చు. లేదా రుణం కూడా తీసుకోవచ్చు. రుణంపై పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే 2% అదనంగా వసూలు చేస్తారు. పీపీఎఫ్ ఖాతా జమలపై రుణం తీసుకుంటే దాన్ని తీర్చిన తర్వాతే మరోసారి రుణం పొందేం దుకు వీలుంటుంది. మూడో ఏట చివరి నుంచి ఏడవ సంవత్సరంలోపే రుణానికి అవకాశం. ఆ తర్వాత నుంచి పెట్టుబడిలో కొంత వెనక్కి తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఏడాదికి ఒక్కసారే ఈ అవకాశం. ఒకవేళ చందాలు జమలేక ఖాతా ఇనాక్టివ్‌గా మారిపోతే రుణాలు పొందడానికి, ఖాతా లో ఉన్న బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. కనీస చందాలతోపాటు జరిమానాలు చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకున్న తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది.
వడ్డీ లెక్కించేది ఇలా...
పీపీఎఫ్‌లో పెట్టుబడులపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 7.8 శాతం వడ్డీరేటు అమలవుతోంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసేవారు 5వ తేదీలోపు ఇన్వెస్ట్ చేస్తేనే ఆ చందాకు ఆ నెలకు సంబంధించిన వడ్డీ లభిస్తుంది. చెక్కు ఇచ్చినా గానీ 5వ తేదీలోపు డ్రా అయి వెళ్లేలా చూసుకోవాలి. పీపీఎఫ్ ఖాతాలోని నగదు బ్యాలెన్స్ ప్రతి నెలా 5వ తేదీన ఎంతయితే ఉంటుందో... దాన్నే వడ్డీకి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వార్షికంగా ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తుంటే ఏప్రిల్ 5వ తేదీలోపు డిపాజిట్ చేయడం ప్రయోజనం. ఏటా మార్చి 31నే వడ్డీ ఖాతాలో జమ చేసినప్పటికీ ప్రతీ నెలా 5వ తేదీ నాటికి ఉన్న బ్యాలెన్స్‌ను పరిగణనలోకి తీసుకుని లెక్కించడం జరుగుతుంది. వార్షికంగా గరిష్ట పరిమితి దాటి ఎంత మొత్తం జమ చేసినా దానిపై వడ్డీ రాదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల జమలపైనే వడ్డీ లభిస్తుంది. వార్షికంగా కనీసం రూ.500 జమ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు పీపీఎఫ్ ఖాతా ఇనాక్టివ్‌గా మారిపోతుంది. తిరిగి ఆ ఖాతాను యాక్టివ్‌గా మార్చుకోవాలంటే అప్పటి వరకు బకాయి పడిన ప్రతి సంవత్సరానికి కనీస చందా రూ.500తోపాటు పెనాల్టీ రూ.50 (ఏటా) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
కనీసం రూ.500;గరిష్ఠం రూ.1.5 లక్షలు
పీపీఎఫ్‌లో ఎంత పడితే అంత డిపాజిట్ చేయటానికి వీల్లేదు. దీనికంటూ నిబంధనలున్నాయి. పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేయొచ్చు. తన పేరిట గానీ, తన పిల్లల పేరిట గానీ పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకు మించడానికి వీల్లేదు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏక మొత్తంలోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే 12 సార్లకు మించి చేయడానికి మాత్రం వీలుండదు. లాకిన్ పీరియడ్ డిపాజిట్ ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి ప్రారంభమవుతుంది కనుక వార్షిక చందాలైతే 16 సార్లు చేయాల్సి ఉంటుంది. నెలవారీ చందాలైతే గరిష్ఠంగా 192 సార్లు డిపాజిట్ చేయవచ్చు.
ముందస్తుగాచఖాతా ముగిస్తే..!
కొన్ని ప్రత్యేక కేసుల్లో పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనికి సైతం కనీసం ఐదేళ్ల కాల వ్యవధి ముగిసి ఉండాలి. నిజానికి పీపీఎఫ్ ఖాతాలో చేసే పెట్టుబడులు, దానిపై రాబడులకు పన్ను మినహాయింపు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే, 15 ఏళ్ల కాల వ్యవధి తీరకుండానే వెనక్కి తీసుకుంటే ఆ మొత్తంపై పన్ను పడుతుంది. వార్షిక ఆదాయ రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ నిధిపై సంపద పన్ను వర్తించదు.
ఏ కోర్టూయ జప్తు చేయలేదు
పీపీఎఫ్ ఖాతాదారుడు ఎవరికైనా, ఏ సంస్థకైనా బకాయి పడితే అతడి ఖాతాను జప్తు చేసేందుకు చట్టం అనుమతించదు. దీంతో పీపీఎఫ్ ఖాతాలో ప్రతి రూపాయి ఆ వ్యక్తికే చెందుతుంది. లేదంటే అతడి కుటుంబ సభ్యులకు దానిపై హక్కు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment