
ముంబై: మొండి పద్దుల వర్గీకరణలో రిజర్వ్ బ్యాంక్ లెక్కలకు, తమ లెక్కలకు మధ్య ఇకపై వ్యత్యాసాల (డైవర్జెన్స్) సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. మార్చితో ముగిసే పూర్తి ఆర్థిక సంవత్సరం లెక్కల్లో ఎటువంటి తేడాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తామని ఆయన చెప్పారు. ఇటీవల డిసెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా.. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ. 23,000 కోట్ల మేర మొండి బకాయిల డైవర్జెన్స్ చూపిన నేపథ్యంలో రజనీష్ కుమార్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
వర్గీకరణలో ’కాలవ్యవధిపరమైన’ అంశాల కారణంగానే మొండిబాకీల లెక్కల్లో వ్యత్యాసాలు తలెత్తాయని కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వాస్తవానికి 2017 మార్చి నాటికే సదరు రుణాలను మొండిబాకీల కింద గుర్తించినప్పటికీ.. అధికారికంగా వర్గీకరణ జరగకపోయి ఉండొచ్చని ఆయన తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ భారీ మొత్తంలో ఎన్‌పీఏలను తక్కువగా చూపించినట్లు ఆర్‌బీఐ తనిఖీల్లో బైటపడిన సంగతి తెలిసిందే.
గతేడాది ఆగస్టులో సవరించిన నిబంధనల ప్రకారం ఎన్‌పీఏల విషయంలో ఆర్‌బీఐ లెక్కలకు, బ్యాంకు లెక్కలకు మధ్య 15 శాతం పైగా వ్యత్యాసం ఉన్న పక్షంలో రిజర్వ్ బ్యాంక్‌కు కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఎస్‌బీఐ లెక్కల్లో 21 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో.. వీటన్నింటికి కేటాయింపులు పెంచాల్సి రావడంతో డిసెంబర్ త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 1,887 కోట్ల నికర నష్టం ప్రకటించాల్సి వచ్చింది.
భారీ పద్దులకు పరిష్కారం..
సుదీర్ఘకాలం మొండిబాకీలుగా కొనసాగుతున్న కొన్ని ఖాతాల మూలంగా ప్రొవిజనింగ్ సైతం అధిక స్థాయిలోనే ఉంటోందని రజనీష్ కుమార్ చెప్పారు. అయితే, భారీ మొండి పద్దులను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా పరిష్కార చర్యల ద్వారా గానీ లేదా రైట్ డౌన్ రూపంలో గానీ ఖాతాల నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలంగా ఎన్‌పీఏగా ఉన్న ఖాతాకు మరింత ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తుంది.
గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఎస్‌బీఐ స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 1.86 లక్షల కోట్ల నుంచి రూ. 1.99 లక్షల కోట్లకు, నికర ఎన్‌పీఏ నిష్పత్తి 9.83 శాతం నుంచి 10.35 శాతానికి పెరిగింది. మరోవైపు, రిటైల్ విభాగం ఊతంతో వచ్చే ఆర్థిక సంవత్సరం రుణ వృద్ధి 10 శాతం మేర ఉండొచ్చని రజనీష్ కుమార్ అంచనా వేశారు. అయితే, కార్పొరేట్ రుణాల విషయంలో మాత్రం ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment