చౌక గృహ రుణాలకు ఆర్‌బీఐ బూస్ట్
- 10 లక్షల వరకూ రుణాలపై ఆఫర్!
- రుణ విలువ లెక్కింపులోనే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు
న్యూఢిల్లీ: చౌక గృహాల నిర్మాణాలకు మరింత ఊపునిచ్చే చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ప్రకటించింది. రూ.10 లక్షల వరకూ గృహ రుణాలకు సంబంధించిన నిబంధనలను సడలించింది. గృహ విలువకు సంబంధించి వ్యయం, రుణ మంజూరీలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కలపడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.
మొత్తం గృహ నిర్మాణ వ్యయం విషయంలో ఈ చార్జీల వాటానే దాదాపు 15 శాతం వరకూ ఉంది. ఈ మొత్తం సైతం రుణగ్రహీతకు భారం అవుతున్న పరిస్థితుల్లో ఆర్‌బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రకారం ఎల్‌టీవీ (లోన్ టు వ్యాల్యూ) నిష్పత్తి లెక్కింపు ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ చార్జీలను కూడా ఇకపై బ్యాంకులు కలుపుతాయి. హౌస్ ప్రాపర్టీ విలువలో ఇప్పటివరకూ బ్యాంకులు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ చార్జీలను కలపడం లేదు.
ఈ వ్యయాలు సైతం భారంగా మారుతున్నాయని, రుణ విలువ లెక్కింపు ప్రక్రియలో వీటిని కూడా జోడించాలని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), దిగువస్థాయి ఆదాయ వర్గాల (ఎల్‌ఐజీ) నుంచి పలు విజ్ఞప్తులు అందుతున్నట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ తెలిపింది. తాజా నిర్ణయానికి ఆయా అంశాలే కారణమని సైతం వెల్లడించింది.
ప్రభుత్వ సంస్థల ప్రాజెక్టుల విషయంలో...
ఒకవేళ ప్రభుత్వం లేదా చట్టబద్ధ సంస్థలు చౌక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టినట్లయితే, ఆయా అథారిటీలు నిర్దేశించిన అంచెల ప్రకారం బ్యాంకులు రుణ మంజూరీలు చేయవచ్చని కూడా ఆర్‌బీఐ ఆదేశించింది. ఆయా సందర్భాల్లో వినియోగదారు ‘నిర్మాణ దశలకు అనుగుణంగా రుణ మంజూరు’ అంశాలను బ్యాంకులు ఇక్కడ పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో వివరణ ఇచ్చింది. బ్యాంకుల నుంచి ఈ మేరకు వచ్చిన సందేహాల పరిష్కారంలో భాగంగా ఆర్‌బీఐ ఈ సూచనలను చేసింది.