
ఈసారీ రేట్ల కోత లేనట్టే!
రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలో ఉండటమే కారణం
- బ్యాంకర్లు, ఆర్థిక నిపుణుల అంచనా
- రేపే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈసారి కూడా వడీ రేట్లను తగ్గించే అవకాశాల్లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం(30న) ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని మార్కెట్లు, కార్పొరేట్లతోపాటు రుణ గ్రహీతల్లోనూ ఆసక్తి నెలకొంది. పాలసీ సమీక్ష విషయంలో ఆర్‌బీఐ ఇప్పుడు రిటైల్ ధరలపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టులో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.8 శాతానికి(జూలైలో 7.96) స్వల్పంగా తగ్గింది.
ఏప్రిల్‌లో 8.5 శాతంగా ఉంది. ఇక టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా జూలైలో 5.19 శాతం నుంచి ఆగస్టులో అనూహ్యంగా 3.74 శాతానికి దిగొచ్చింది. వచ్చే ఏడాది జనవరికల్లా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి, 2016 జనవరినాటికి 6శాతానికి కట్టడి చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. గత సమీక్షలో ఆర్‌బీఐ కేవలం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ప్రభుత్వ బాండ్‌లలో బ్యాంకులు తప్పనిసరిగా ఇన్వెస్ట్‌చేయాల్సిన నిధులు)ని అరశాతం తగ్గించి 22 శాతానికి చేర్చింది. తద్వారా వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు విడుదలయ్యేలా చేసింది. ఇక రెపో రేటు 8%, రివర్స్ రెపో 7%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4% చొప్పున యథాతథంగా కొనసాగించింది.
బ్యాంకర్లు ఇలా...
ఆర్‌బీఐ రేట్ల కోతకు ఇది సమయం కాదని.. రానున్న పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. వరుసగా కొన్ని నెలలపాటు ద్రవ్యోల్బణం తగ్గుదల నమోదైతేనే రేట్ల కోతను ఆర్‌బీఐ పరిశీలించవచ్చని కెనరా బ్యాంక్ సీఎండీ ఆర్‌కే దూబే పేర్కొన్నారు. వడ్డీరేట్ల తగ్గింపునకు జనవరిలోనే అవకాశం ఉండొచ్చని ఆయన అంచనావేశారు. కాగా, తక్షణం వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) పెంచాల్సిన అవసరం లేదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎంవీ టంకశాల చెప్పారు. రుణ వృద్ధి ఇంకా మందకొడిగానే ఉన్న నేపథ్యంలో ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించక్కర్లేదన్నారు. కాగా, రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం ఎగబాకొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈసారి సమీక్షలో రేట్ల కోతకు అవకాశాలు అంతగా లేవని కేర్ రేటింగ్ పేర్కొంది.