
రూ. 6,500 కోట్ల సంగతేంటి..?
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు కేటాయించిన కేజీ-డీ6 బేసిన్‌లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రం కాంట్రాక్ట్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన రూ. 6,500 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తును చేపట్టిందీ వివరించమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ను వివరణ అడిగింది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, తమ వంతు వచ్చాక తగువిధంగా స్పందిస్తుందని మోహన్ కోర్టుకు వివరించారు.
ముకేష్ అంబానీ గ్రూప్ కంపెనీ ఆర్‌ఐఎల్‌కు సహకరించేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకమయ్యాయంటూ ఎన్‌జీవో కామన్ కాజెస్ కౌన్సిల్ తరఫున ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఇది కీలకమైన అంశమే అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ విషయాన్ని లేవనెత్తకపోవడం గమనార్హమని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. సీనియర్ సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, ఎన్‌జీవో కామన్ కాజ్ వేసిన పిటిషన్లపై స్పందిస్తూ కేవలం వ్యక్తులే ఈ విషయాలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు వ్యాఖ్యానించింది. కాగా, ఎంపీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సేల్వ్స్ తమ వాదనను ముగించిన తరువాత, ఎన్‌జీవో తరఫున విచారణకు హాజరైన భూషణ్ ఈ కేసుకు సంబంధించిన ఒక లేఖను కోర్టుకు చదివి వినిపించారు.
ఊరూపేరూలేని కంపెనీలతో..: సింగపూర్‌లోని ఇండియన్ హైకమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖగా పేర్కొంటూ భూషణ్ లేఖలోని కొన్ని విషయాలను కోర్టుకు వినిపించారు. సింగపూర్‌లో ఒకే గదిలో ఏర్పాటు చేసిన ఎలాంటి వ్యాపారాలూ నిర్వహించని ఒక సంస్థ రూ. 6,500 కోట్లను ఇన్వెస్ట్ చేయడంపై దర్యాప్తునకు సంబంధించిన ఈ లేఖను భూషణ్ కోర్టుకు సమర్పించారు. బయో మెట్రిక్స్ మార్కెటింగ్ అనే సంస్థ ద్వారా ఇండియాకు ఈ పెట్టుబడులు అందినట్లు హైకమిషన్ పేర్కొన్న విషయాన్ని భూషణ్ తెలియజేశారు. ఈ కంపెనీకి ఎలాంటి ఆస్తులు, ఈక్విటీ లేదని ఆయన వివరించారు.
బ్యాంకింగ్ లెసైన్స్‌లపై ఈసీ దృష్టి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీ అంశంపై ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టిసారించింది. సోమవారం(31న) లెసైన్స్‌ల అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ బుధవారమిక్కడ చెప్పా రు. ఈసీ అడిగిన కొన్ని వివరణలను ఆర్‌బీఐ ఇప్పటికే సమర్పించిందని కూడా ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లెసైన్స్‌ల జారీపై నిర్ణయం కోసం ఆర్‌బీఐ ఈసీకి లేఖరాయడం తెలిసిందే. ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలు; అనిల్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌లతో సహా మొత్తం 24 కంపెనీలు బ్యాంకింగ్ లెసైన్స్‌ల రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, కొత్త లెసైన్స్‌ల జారీ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరాలేంటన్న ప్రశ్నకు... వాళ్లు(ఆర్‌బీఐ) నిబంధనల విషయంలో పూర్తి విశ్వాసంతో ఉంటే మా పరిశీలన కోసం ఎందు కు పంపాల్సి వస్తుంది. తమ విధులను నమ్మకంగా, సంతృప్తికరంగా, సక్రమంగా నిర్వర్తించినప్పుడు అసలు ఈ అంశాన్ని ఈసీ నిర్దేశం కోసం పంపించాల్సిన అవసరమే లేదని బ్రహ్మ స్పష్టం చేశారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల అంశానికి సంబంధించి గతేడాది(2013)లోనే నిర్ణయం తీసుకున్నప్పుడు జారీ చేయనీయకుండా ఆర్‌బీఐకి ఉన్న అడ్డకుంలేమిటని కూడా ఆయన ప్రశ్నించారు.