శాంసంగ్ గెలాక్సీ ఎస్8, 8ప్లస్ వచ్చేశాయ్..
మే నెల 5 నుంచి అందుబాటులోకి
ప్రారంభ ధర రూ.57,900
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ‘ఎస్8’, ‘ఎస్8 ప్లస్’లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.57,900, రూ. 64,900గా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మే నెల 5 నుంచి అందుబాటులోకి వస్తాయని, వీటిని కస్టమర్లు ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్స్ సహా శాంసంగ్ షాప్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది. ఫోన్ల ప్రి–బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.
డెక్స్ ఫీచర్ కలిగిన ఎస్8 ఫోన్లను డెస్క్‌టాప్‌లాగా వాడుకోవచ్చని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మొబైల్ బిజినెస్) అసిమ్ వార్సి తెలిపారు. అలాగే ఎస్8 ఫోన్లను కొనుగోలు చేసిన వారు రిలయన్స్ జియో నుంచి డబుల్ డేటా ఆఫర్‌ను పొందొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్లకు చాలా ప్రి–బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. దక్షిణ కొరియా, అమెరికా, కెనడాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఏప్రిల్ 21 నుంచే ప్రారంభం కానున్నాయి.
ఎస్8, ఎస్8 ప్లస్ ప్రత్యేకతలు...
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఇన్‌విజిబుల్ హోమ్ బటన్, 1.9 గిగాహెర్ట్›్జఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లుంటే ఎస్8 ప్లస్‌లో మాత్రం 6.2 అంగుళాల స్క్రీన్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఇక రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ‘బిక్స్‌బీ’ ఫీచర్ సహా ఐరిస్ స్కానర్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, శాంసంగ్ నాక్స్, శాంసంగ్ పే వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయని వివరించింది.