నోయిడా: దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ దీన్ని సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 6.8 కోట్లుగా ఉన్న శాంసంగ్ హ్యాండ్‌సెట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దశలవారీగా 2020 నాటికి 12 కోట్లకు పెంచుకునేందుకు ఈ కొత్త ప్లాంటు తోడ్పడనుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ఊతంతో .. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరిందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాలుగేళ్ల క్రితం భారత్‌లో మొబైల్ ఫోన్స్ తయారీ ఫ్యాక్టరీలు రెండే ఉండగా..ఇప్పుడు 120కి చేరాయని పేర్కొన్నారు. హ్యాండ్‌సెట్స్ ఫ్యాక్టరీలు పెరిగే కొద్దీ ఉపాధికి కూడా తోడ్పాటు లభించిందని, నాలుగు లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని ప్రధాని చెప్పారు.
‘భారత్‌ను ప్రపంచ తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. మేకిన్ ఇండియా నినాదం కేవలం ఆర్థిక విధానంలో భాగం మాత్రమే కాదు.. దక్షిణ కొరియా వంటి దేశాలతో ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కూడా ఇది తోడ్పడనుంది’ అని ఆయన తెలిపారు. నయా మధ్యతరగతి ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయన్నా రు. భారత్‌లో 40 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో ఉన్నాయని, 32 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ప్రధాని చెప్పారు.
ప్లాంటులో 2 వేల కొలువులు..
వేగంగా ఎదుగుతున్న భారత్ వృద్ధి సాధనలో పలు కొరియన్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ తెలిపారు. శాంసంగ్ వంటి కంపెనీలు ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలతో ఉపాధికి తోడ్పాటు లభించగలదన్నారు. శాంసంగ్ కొత్త ప్లాంటుతో కొత్తగా 2,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు.
ఇక్కడ తయారయ్యే స్మార్ట్‌ఫోన్స్.. ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతవుతాయని తెలిపారు. మొబైల్ ఫోన్స్ ఎగుమతుల హబ్‌గా ఎదగాలన్న భారత్ లక్ష్య సాధనకు పూర్తి తోడ్పాటు అందిస్తామని శాంసంగ్ ఇండియా సీఈవో హెచ్‌సీ హాంగ్ తెలిపారు.
రూ. 5వేల కోట్ల పెట్టుబడులు..
శాంసంగ్ కంపెనీ నోయిడాలో 1996లో తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. కీలకమైన గెలాక్సీ ఎస్9, ఎస్9+, గెలాక్సీ నోట్8 వంటి ఫోన్స్ ఇందులోనే తయారవుతున్నాయి. సుమారు రూ. 4,915 కోట్లతో ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు శాంసంగ్ గతేడాది జూన్‌లో ప్రకటించింది. శాంసంగ్‌కి చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మరో ప్లాంటు కూడా ఉంది. భారత్‌లో అయిదు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు.. ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment