బ్యాంకుల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) కీలక ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకును ఎస్ బీఐలో విలీనం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులు ఫుల్ జోష్ లో నడిచాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ లు 20శాతం లాభాలను నమోదుచేశాయి.
కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే ఈ ర్యాలీ కొనసాగినట్టు మీడియా రిపోర్టులు నివేదించాయి. ఈ ఆమోదంతో నాలుగు లిస్టెడ్ బ్యాంకులు, ఒక్క అన్ లిస్టెడ్ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకు ఆస్తులు, అప్పులను ఎస్ బీఐ తనలో విలీనం చేసుకోనుంది. మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ విలీనంతో ఎస్ బీఐ నెట్ వర్క్ లు 41శాతం పెరగనున్నాయి. 23 వేల ఎస్ బీఐ బ్రాంచ్ లు అందుబాటులో ఉండనున్నాయి. వర్క్ ఫోర్స్ కూడా 33శాతం పెరిగి 2,85,500 ఉద్యోగులకు చేరుకోనుంది.
మార్కెట్లో షేర్ల జోరు
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3.9 శాతం ఎగబాకి 215.65గా నమోదైంది.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్ 19.99 శాతం పెరిగి రూ. 478.90వద్ద ముగిసింది.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 19.99 శాతం వృద్ధితో రూ.599.60కు చేరింది.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ 20 శాతం పెరుగుదలతో రూ.547.90గా నమోదైంది.