రిలయన్స్‌పై సెబీ కొరడా
⇒ ఎఫ్ అండ్‌ఓలో పాల్గొనకుండా ఏడాదిపాటు నిషేధం
⇒ రూ.1,300 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో 12 సంస్థలు డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా ఏడాది పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)లో రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్‌పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్‌పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఆర్‌ఐఎల్‌లో ఆర్‌పీఎల్‌ను విలీనం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం ఫ్యూచర్స్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ జరిపారని, ఈ లావాదేవీల్లో ఆర్‌ఐఎల్, ఇతర 12 సంస్థలు రూ.513 కోట్లు అక్రమ లాభాలు పొందాయని సెబీ ఆదేశాలు పేర్కొన్నాయి. ఇందుకు గాను ఆర్‌ఐఎల్, మరో 12 ఇతర సంస్థలు ఈక్విటీ డెరివేటివ్స్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకుండా సెబీ హోల్ టైమ్ మెంబర్ జి. మహాలింగమ్ నిషేధం విధించారు. అంతేకాకుండా రూ.513 కోట్ల అక్రమ లాభాలపై ఏడాదికి 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున రూ.1,300 కోట్లు 45 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొన్నారు.
సెబీ నిషేధం విధించిన ఇతర 12 సంస్థలు.. గుజరాత్ పెట్‌కోక్, ఆర్తిక్ కమర్షియల్స్, ఎల్పీజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్‌పోల్ ప్లాస్టిక్ ప్రొడక్టŠస్, ఫైన్ టెక్ కమర్షియల్స్, పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటెక్ సాఫ్ట్‌వేర్, దర్శన్ సెక్యూరిటీస్, రెలోజిస్టిక్స్(ఇండియా), రెలోజిస్టిక్స్(రాజస్థాన్), వినమర యూనివర్శల్, ధర్తి ఇన్వెస్ట్‌మెంట్ . కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)లో సవాల్ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.