షేర్ల ధర అవకతవకలకు పాల్పడే కంపెనీలపై సెబీ చర్యలు
న్యూఢిల్లీ: షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడే కంపెనీలు, సంబంధిత డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. పన్నులు తప్పించుకోవడానికి సెక్యూరిటీల చట్టాన్ని వేలాది కంపెనీలు ఉల్లంఘించాయని సెబీ భావిస్తోంది. అందుకనే షేర్ల ధరల విషయమై అవకతవకలకు పాల్పడే లిస్టెడ్ కంపెనీలు, సంబంధిత డైరెక్టర్లపై తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలను సెబీ చేస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా లబ్ది పొందిన వారి వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి సెబీ అందించనున్నది. ఈ అంశాలకు సంబంధించిన ఒక ప్రతిపాదన ఈ వారంలో సెబీ బోర్డ్ ముందుకు రానున్నది.
ఆదాయపు పన్ను విభాగం నివేదించిన వివిధ షేర్ల లావాదేవీలపై సెబీ జరిపిన విశ్లేషణ ఆధారంగా సెబీ ఈ ప్రతిపాదనను రూపొందించిందని సమాచారం.వివిధ కేటగిరీల్లో 32వేలకు పైగా కంపెనీలపై తదుపరి విచారణ జరపాలని సెబీ నిర్ణయించిందని ఈ వర్గాలు వెల్లడించాయి. అక్రమంగా లాభాలు ఆర్జించడానికి లిస్టెడ్ కంపెనీలు, ఆపరేటర్లు, సంబంధిత సంస్థలు పలు స్కీమ్‌లను రూపొందించాయని ఐటీ విభాగం సెబీ దృష్టికి తెచ్చింది. దీర్ఘకాల మూలధన లాభాలు(ఎల్‌టీజీఎస్), స్వల్పకాలిక మూలధన నష్టాలు చూపడానికి షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడడం ద్వారా స్టాక్ ఎక్సే్చంజ్ ప్లాట్‌ఫార్మ్‌ను దుర్వినియోగం చేశారని ఐటీ విభాగం సెబీకి తెలిపింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్ల జారీ, లేదా విలీన ప్రక్రియల ద్వారా అక్రమంగా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు పొందారని ఐటీ విభాగం వివరించింది.