ముంబై: మంగళవారం సెలవు దినం అనంతరం ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఊగిసలాటలో నడుస్తున్నాయి. మొదట్లో 26 వేల మార్కుకు దగ్గర్లో ట్రేడ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్, క్రమేపీ నష్టాల్లోకి జారుకుంది. 100 పైగా లాభంతో దూసుకెళ్లిన సెన్సెక్స్, అదేవిధంగా నిఫ్టీ సైతం 8 వేల మార్కు చేరువదాకా వెళ్లినా మళ్లీ ఎనిమిది వేల దిగువకు జారుకుంది. ఇంట్రా డే లో క్రిసీల్ షేర్లు 13 శాతం కంటే ఎక్కువ లాభాలను నమోదుచేయడంతో, ప్రారంభంలో నిఫ్టీలో షేర్లు పుంజుకున్నాయి. జనవరి, మార్చి త్రైమాసికంలో ఇవే ఎక్కువ లాభాలన్నీ క్రిసిల్ ప్రకటించింది.
టాటా స్టీల్, హిందాల్కో, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా సెన్సెక్స్ లో లాభాల బాటలో నడుస్తుండగా... టీసీఎస్, మహింద్రా అండ్ మహింద్రా, మారుతీ, సన్ ఫార్మా, భారతీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే దాదాపు 30 షేర్లు 100 పాయింట్లకు పైగా లాభాలను నమోదుచేశాయి. అదేవిధంగా విప్రో కంపెనీ సైతం నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ సాయంత్రం విడుదలచేయనున్న నేపథ్యంలో దాని షేర్లు ఒక శాతం ఎక్కువ లాభాలను నమోదుచేశాయి. అయితే ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ నమోదుచేస్తున్న నష్టాలు మార్కెట్లో కొంత ప్రభావం చూపనుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఓ వైపు క్రూడ్ ఆయిల్ షేర్లు పడిపోతుండగా, మరోవైపు బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి.