మార్కెట్లకు సుప్రీం దెబ్బ
బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ అక్రమాలేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో మెటల్, పవర్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. 1993 మొదలు 2011 వరకూ ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలకు వివిధ ప్రభుత్వాలు కేటాయించిన బొగ్గు క్షేత్రాలలో ఎలాంటి పారదర్శకతా లేదని సుప్రీం పేర్కొంది. దీంతో తొలుత సరికొత్త రికార్డులను నమోదుచేసిన స్టాక్ మార్కెట్లు చివర్లో బలహీనపడ్డాయి.
ఒక దశలో 211 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 26,630ను అధిగమించింది. ఇది సరికొత్త రికార్డుకాగా, నిఫ్టీ సైతం చరిత్రలో తొలిసారి 7,968ని తాకింది. అయితే చివరి గంటలో అమ్మకాలు ఊపందుకుని నష్టాలలోకి మళ్లాయి. సెన్సెక్స్ 26,401 పాయింట్ల వద ్ద, నిఫ్టీ 7,898 వద్ద కనిష్టానికి చేరాయి. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 26,437 వద్ద నిలిచింది. నిఫ్టీ మాత్రం 7 పాయింట్ల నష్టంతో 7,906 వద్ద స్థిరపడింది.
మెటల్, పవర్ షేర్లు డీలా!
మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ 14% , హిందాల్కో 10% తగ్గాయి. భూషణ్ స్టీల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, హిందుస్తాన్ జింక్, సెయిల్ 5-2% మధ్య నీరసించాయి. దీంతో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 4.5%నష్టపోయింది. పవర్ షేర్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అదానీ పవర్, రిలయన్స్ పవర్, టాటా పవర్, ఎన్‌హెచ్‌పీసీ 5-3% మధ్య క్షీణించాయి. కాగా రియల్టీ షేర్లు శోభా, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్ సైతం 4-2% మధ్య తిరోగమించాయి. అయితే సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఐటీసీ 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. కాగా, డెట్ రేటింగ్‌ను ఇక్రా డౌన్‌గ్రేడ్ చేయడంతో జె ట్ ఎయిర్‌వేస్ షేరు 5% పతనమైంది.