దేశీయ ఆర్థిక ప్రతికూలాంశాల్ని సైతం లెక్కచేయకుండా... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావం, విదేశీ నిధుల వెల్లువ కారణంగా స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. అయినప్పటికీ, ప్రపంచంలో ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండియా సూచీలు పెరిగింది తక్కువే. అమెరికా ఎస్ అండ్ పీ500 సూచీ 30 శాతం, 50 దేశాలతో కూడి ఎంఎస్‌సీఐ సూచీ 24 శాతం చొప్పున ర్యాలీ సాగించగా, నిఫ్టీ–50 సూచి ఈ ఏడాది పెరిగింది 13 శాతమే. దేశీయ ఆర్థికాంశాల ప్రతికూలతే ఇందుకు కారణం కావొచ్చు.
భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సమీప భవిష్యత్తులో పుంజుకుంటుందన్న అంచనాలు లేకపోయినా, అమెరికా ఫెడ్, ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల సరళ విధానాల ఫలితంగా ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఇది రికార్డు. ఇందుకు తోడు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ 55,000 కోట్ల వరకూ ఈక్విటీల్లో పెట్టుబడి చేశాయి. ఇప్పటివరకూ జరిగిన పెట్టుబడుల ప్రభావం, కొత్త ఏడాదిలో జరిగే పెట్టుబడుల అంచనాల కారణంగా స్టాక్ మార్కెట్ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని సృష్టించే అవకాశం లేకపోలేదు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
డిసెంబర్ 20తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రమేపీ పెరుగుతూ 41,810 పాయింట్ల రికార్డుస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 672 పాయింట్ల లాభంతో 41,682 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా రెండు వారాల్లో సెన్సెక్స్ 1,200 పాయింట్లకుపైగా లాభపడింది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు రికార్డు ర్యాలీ జరిపిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 41,850–41,980 పాయింట్ల శ్రేణిలో తొలి అవరోధం కలగవచ్చు. ఈ సందర్భంగా 41,850పైన స్థిరపడితే క్రమేపీ 42,200 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 42,380 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్సుంది. ఈ వారం తొలి అవరోధశ్రేణిని అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 41,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 41,165 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 41,000 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.
నిఫ్టీ 12,300పైన స్థిరపడితే...
గత కాలమ్‌లో ప్రస్తావించిన రీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,293 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 185 పాయింట్ల లాభంతో 12,272 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ రెండు వారాల్లో 340 పాయింట్ల వరకూ లాభపడింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 12,300–12,350 పాయింట్ల శ్రేణి తొలుత నిరోధించవచ్చు. ఈ క్రమంలో 12,300 పాయింట్లపైన నిఫ్టీ స్థిరపడగలిగితే క్రమేపీ 12,425 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం వుంది. అటుపైన 12,485 పాయింట్ల స్థాయిని సైతం అందుకునే చాన్స్ వుంటుంది. ఈ వారం నిఫ్టీ పైన ప్రస్తావించిన తొలి అవరోధశ్రేణిని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 12.180 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున ముగిస్తే 12,135 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 12,070 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.
– పి. సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment