మార్కెట్‌పై ఇరాక్ ఎఫెక్ట్
ద్రవ్యోల్బణం, ఎఫ్‌ఐఐల పెట్టుబడులూ కీలకమే
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికీ ప్రాధాన్యత
- చమురు ధరలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్ల దృష్టి
- ఈ వారం మార్కెట్ నడకపై నిపుణుల అంచనాలు
ఈ వారం దేశీ మార్కెట్ ట్రెండ్‌ను ఇరాక్ అంతర్యుద్ధ పరిస్థితులు నిర్దేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారీగా చమురు నిల్వలు కలిగిన ఇరాక్‌లో సున్నీలు, కుర్దుల తిరుగుబాటుతో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న అమెరికా అవసరమైన పక్షంలో తగిన చర్యలను చేపడ తామంటూ గత వారం చివర్లో ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో దేశీ మార్కెట్‌సహా యూరప్ ఇండెక్స్‌లు నష్టపోయిన సంగతి తెలిసిందే.
సెన్సెక్స్ 348 పాయింట్లు పతనమై 25,228 వద్ద ముగిస్తే, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 108 పాయింట్లు దిగజారి 7,542 వద్ద స్థిరపడింది. కాగా, ఇప్పటికింకా పరిస్థితులు కుదుటపడకపోవడంతో ఈ వారం కూడా మార్కెట్‌పై అంతర్యుద్ధ ప్రభావం కనిపించే అవకాశమున్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటికితోడు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులుసైతం మార్కెట్‌ను నడిపించనున్నాయని తెలిపారు. మే నెలకు డబ్ల్యూపీఐ గణాంకాలు సోమవారం(16న) విడుదలకానున్నాయి.
మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో డబ్ల్యూపీఐ 5.7% నుంచి 5.2%కు దిగివచ్చింది. ఈ బాటలో డ బ్ల్యూపీఐ మరింత తగ్గితే ఆగస్ట్ 5న నిర్వహించనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టేందుకు వీలు చిక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చమురు ధరలపై దృష్టి
అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరల కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు డాలర్‌తో మారకంలో రూపాయి కదలికలూ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఇరాక్ భయాలతో గత వారం చమురు ధరలు 9 నెలల గరిష్టమైన 113 డాలర్లను అధిగమించడంతో ఆందోళనలు పెరిగాయి. ఇవి మరింత పుంజుకుంటే చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే ఇండియావంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుందని నిపుణులు విశ్లేషించారు.
రుతుపవనాలపై అంచనాలు
ఇకపై రుతుపవనాల పురోగమనం కూడా మార్కెట్లను నడిపిస్తుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్ర బడ్జెట్ మార్కెట్లకు కీలకంగా నిలవనుందని చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 17 నుంచి రెండు రోజులపాటు పాలసీ సమీక్షను చేపట్టనుంది. 18న కీలక నిర్ణయాలను వెలువరించనుంది. ఫెడ్ నిర్ణయాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు స్పందించే విషయం విదితమే.
అడ్వాన్స్ ట్యాక్స్‌పై కన్ను్ర తొలి విడతగా కార్పొరేట్ సంస్థలు చెల్లించే ముందస్తు పన్ను(అడ్వాన్స్ ట్యాక్స్) గణాంకాలు సైతం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తుందని నిపుణులు వివరించారు. కంపెనీల ఆర్జనకు అనుగుణంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులుంటాయని విశ్లేషించారు. అయితే శుక్రవారం ఏర్పడ్డ నష్టాల ప్రభావం సోమవారం కూడా ఉండవచ్చునని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. క్రూడ్ ధరలు పెరిగితే సెంటిమెంట్ మరింత బలహీనపడుతుందన్నారు.