మార్కెట్ పంచాంగం
కారణం ఏదైనా, సాధారణంగా జనవరి నెలలో కన్పించే ఒడిదుడుకులు ఈ ఏడాది కూడా ప్రస్ఫుటమయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ సూచీలు గతవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే భారీ పతనం జరిగిన తర్వాత మార్కెట్లో రికవరీ సందర్భంగా రెండు ప్రధాన షేర్లు హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరడం శుభసూచకం.
ఇలా సూచీల్లో భాగస్వాములైన షేర్లు కొత్త రికార్డును సృష్టించడంవల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుంది. తద్వారా సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా పతనమయ్యే ప్రమాదం తప్పుతుంది. కానీ ఈ ప్రమాదంలో పడకుండా వుండాలంటే వచ్చే కొద్దివారాల్లో మరిన్ని షేర్లు కొత్త గరిష్టస్థాయిల్ని సాధించాల్సివుంటుంది. అలా కాకుండా హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఈ వారం భారీగా క్షీణిస్తే సాంకేతికంగా మార్కెట్ డేంజర్‌జోన్‌లో ప్రవేశించినట్లే. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జనవరి 9తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,064 పాయింట్ల గరిష్టస్థాయి-26,776 పాయింట్ల కనిష్టస్థాయిల మధ్య 1,300 పాయింట్ల మేర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 430 పాయింట్ల నష్టంతో 27,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సైతం ఒడిదుడుకులు కొనసాగితే సెన్సెక్స్‌కు 27,100 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే 26,900 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు.
ఈ స్థాయిని కూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే తిరిగి 26,770 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం ప్రారంభంలో 27,100 మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 27,700 పాయింట్ల అవరోధస్థాయి వరకూ ర్యాలీ జరపవచ్చు. ఆపైన ముగిస్తే 28,050 స్థాయికి పెరగవచ్చు. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే క్రమేపీ 28,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 8,170
గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 8,450 పాయింట్ల వద్ద క్రితం సోమవారం అవరోధాన్ని ఎదుర్కొన్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వేగంగా 8,065 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. వారాంతానికల్లా కొంతమేర నష్టాల్ని పూడ్చుకొని, చివరకు 110 పాయింట్ల నష్టంతో 8,285 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,170 స్థాయి వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఆ లోపున ముగిస్తే నేరుగా 8,100 స్థాయికి తగ్గవచ్చు.
ఈ స్థాయిని కూడా వదులుకుంటే తిరిగి 8,060 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ ర్యాలీ సాగించాలంటే 8,330 పాయింట్ల సమీపంలో వున్న అవరోధాన్ని తొలుత దాటాల్సివుంటుంది. ఆపైన ముగిస్తే తిరిగి 8,450-8,500 అవరోధ శ్రేణివరకూ పెరగవచ్చు. సూచీ కొత్త రికార్డును నెలకొల్పాలంటే 8,545 పాయింట్ల స్థాయిని దాటాల్సివుంటుంది.
సెన్సెక్స్ మద్దతు 27,100 పాయింట్లు
Published Mon, Jan 12 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement
Advertisement