ముంబై : బుధవారం నాటి దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా మెల్లిగా లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు రావడంతో కొంత మేర కోలుకున్నాయి.. సెన్సెక్స్ 36.24 పాయింట్ల లాభంతో 26,043 వద్ద కదలాడుతుండగా.. నిఫ్టీ 16.35 పాయింట్ల లాభంతో 7979 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఊగిసలాటల మధ్య ట్రేడవుతున్న నేటి మార్కెట్లలో మంగళవారం ట్రేడింగ్ ఫుల్ జోష్ మీదున్న బ్యాంక్ ఇండెక్స్ షేర్లు బుధవారం ట్రేడింగ్ లో నష్టాలను చవిచూస్తున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, లుపిన్ షేర్లు నష్టాల్లో నడుస్తుండగా.. టాటా మోటర్స్, ఐటీసీ, హీరో, భారతీ ఎయిర్ టెల్, మారుతీ సుజుకీ,ఓఎన్ జీసీ, లాభాలు పండిస్తున్నాయి. బ్యాంకు షేర్లలో యాక్సిస్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. 22,600 కోట్ల కార్పొరేట్ రుణాలను మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు 'వాచ్ లిస్ట్' ప్రకటించడంతో ఈ షేర్లు 3 శాతం పైగా పడిపోయాయి. మరోవైపు బంగారం 92 పాయింట్లు పెరిగి, 29,294 వద్ద నమోదవుతుండగా, వెండి 444 పాయింట్ల లాభంలో 40,634 గా కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 66.51గా ఉంది.