ట్రంప్ ప్రభావం: మార్కెట్లు భారీగా పతనం
Published Fri, Jan 20 2017 4:23 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రారంభోపన్యాసం చేయనున్న నేపథ్యంలో మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 274.10 పాయింట్లు పతనమై 27034.50 వద్ద, నిఫ్టీ 85.75 పడిపోయి 8349.35 వద్ద ముగిశాయి. ట్రంప్ స్పీచ్తో పాటు, బ్యాంకు ఆస్తుల క్వాలిటీపై ఆందోళన నెలకొనడంతో పెట్టుబడిదారులు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగించారు. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ సబ్ ఇండెక్స్ 1.59 శాతం పడిపోయంది. వీటిలో ఎక్కువగా యాక్సిస్ బ్యాంకు కుదేలైంది. ఈ బ్యాంకు తన క్యూ3 ఫలితాల్లో నిరాశపరచడంతో (నికర లాభం 73 శాతం డౌన్) షేరు విలువ 7.26 శాతం పతనమైంది.
బ్యాంకు ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 2.5 శాతం నుంచి 3.8 శాతం పడిపోయాయి. ఇతర బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఇన్ఫ్రాక్ట్ర్చర్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అయితే నిఫ్టీ 50 ఇండెక్స్లో టెలికాం స్టాక్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్టెల్ 2.96 శాతం, 1.14 శాతం పైగా లాభపడ్డాయి. యస్ బ్యాంకు, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, బజాజ్ ఆటోలు మేజర్ గెయినర్లుగా ఉన్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.07 పైసలు పడిపోయి 68.20 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 45 రూపాయలు పెరిగి 28,573గా నమోదైంది.
Advertisement
Advertisement