
సాఫ్ట్‌వేర్.. కుదేల్
తమిళనాడు రాజధాని చెన్నై నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కుదేలయ్యాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచి కదిలే పరిస్థితి లేకపోవడం, ఆఫీసులలోకి కూడా నీళ్లు వచ్చేయడంతో చాలా కంపెనీలు ఆదివారం వరకు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి కార్మిక శాఖ ఇప్పటికే రెండు రోజులు సెలవులు ప్రకటించింది. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని చూస్తున్నా, ఎక్కడా విద్యుత్ సరఫరా గానీ, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు గానీ లేకపోవడంతో దానికి కూడా వీలు కుదరట్లేదు. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, టీసీఎస్, ఐబీఎం లాంటి ప్రధాన కంపెనీలన్నింటిపైనా కూడా వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది అయ్యింది. అప్పట్లో చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు.
నగరం నుంచి బయటకు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోయాయి. విమానాశ్రయం కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడంతో వాయుమార్గం ఆప్షన్ సైతం లేదు. తాత్కాలికంగా నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్‌ను పౌర విమానాశ్రయంగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌బస్ ఎ 320 విమానం ఒకదాన్ని అక్కడ ల్యాండ్ చేసి పరీక్షించారు. అయితే, ఆ ఎయిర్‌బేస్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడివరకు వెళ్లడం కూడా పెద్ద సమస్యగానే ఉంది. మరో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో సాఫ్ట్‌వేర్ కంపెనీల యాజమాన్యాల గుండెల్లో గుబులు పట్టుకుంది.
ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి.