ఈ ఫోన్ రేటు చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
జెరుసలేం: మనకు తెలిసిన మామూలు ఫోన్ల రేట్లు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. మరి సోలారిన్ పేరుతో విడుదలకు సిద్ధమైన ఈ ఫోన్ రేటు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే... ఈ మొబైల్ ఖరీదు అక్షరాల 20 వేల డాలర్లు(13.3 లక్షలు) ఇంత రేటు కలిగిన మొబైల్స్ సాధారణంగా వజ్రాలు, బంగారంతో డిజైన్లు చేసి ఉంటాయనుకుంటున్నారా? అయితే సోలారిన్ ... సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగానే ఉండబోతోందని కంపెనీ తెలిపింది.
ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటా..? అని అనుకుంటున్నారా....ఈ మొబైల్ను తయారు చేస్తున్న బ్రిటీష్, ఇజ్రాయెల్లకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ... ఉద్యోగ నిపుణులను దృష్టిలో ఉంచుకుని తామీ ఫోన్ తయారు చేస్తున్నట్లు తెలిపింది. కాస్త రేటు ఎక్కువగా అనిపించినా సోలారిన్ మిలటరీ గ్రేడ్ సెక్యూరిటీతో వినియోగదారులకు లభిస్తుందనీ, దీనివల్ల సమాచారాన్ని హ్యాక్ కాకుండా కాపాడుకునేందుకు ఎక్కువ వెచ్చించాల్సిన పని లేదని కంపెనీ వివరించింది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెక్నాలజీకి ఈ ఫోన్ ఫీచర్స్ మూడు సంవత్సరాల ముందుకు ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు చెప్పారు. యూరప్, అమెరికా దేశాల్లో హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవాలని చూసే వారందరూ ఈ మొబైల్ను కొనేందుకు ఆసక్తి చూపుతారని వారు వివరించారు. ప్రస్తుతం ప్రపంచ లగ్జరీ ఫోన్ల మార్కెట్ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా ఉందని వారు తెలిపారు.