చౌక పబ్లిక్ వై–ఫైకి బూస్ట్!
⇒ కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదనలు
⇒ పీడీవో, పీడీవోఏలు ఏర్పాటు చేయాలని సూచన
⇒ వై–ఫై ఉపకరణాలపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వై–ఫై సేవలను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ భావిస్తోంది. దీనికోసం పలు ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే మాత్రం అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వై–ఫై ఉపకరణాలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రాయ్ సూచించింది. అలాగే చౌక ధరలకే పబ్లిక్ వై–ఫై సర్వీసులను అందించేలా ‘పీడీవో’, ‘పీడీవోఏ’లకు వెసులుబాటు కల్పించాలని కోరింది. ‘పబ్లిక్ డేటా ఆఫీస్’ (పీడీవో)ల ఏర్పాటుకు నియమ నిబంధనలను రూపొందించాలి. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ (పీడీవోఏ)తో భాగస్వామ్యమైన పీడీవోలను పబ్లిక్ వై–ఫై సేవలను అందించడానికి అనుమతించాలి’ అని పేర్కొంది.
ఇలాంటి చర్యల వల్ల కేవలం పబ్లిక్ హాట్‌స్పాట్స్ సంఖ్య పెరుగడమే కాకుండా దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వై–ఫై యాక్సెస్ పాయింట్ ఉపకరణాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల ఇంటర్నెట్ సర్వీసులను అందించడానికి అయ్యే వ్యయాలు తగ్గుతాయని పేర్కొంది. ‘ఎలాంటి ప్రత్యేకమైన లైసెన్స్ అవసరం లేకుండానే పీవోడీఏలను వై–ఫై సర్వీసులను అందించడానికి అనుమతించే అవకాశముంది. అయితే ఇవి టెలికం డిపార్ట్‌మెంట్ సూచించిన రిజిస్ట్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది’ అని తెలిపింది. దీంతో గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కి ఊతమిచ్చినట్లు అవుతుందని, గ్రామాల్లో బలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. వై–ఫై నెట్‌వర్క్‌లో ఒక ఎంబీ డేటా ఖర్చు 2 పైసల కన్నా తక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన ట్రాయ్.. 2జీ, 3జీ, 4జీ వంటి సెల్యులర్ నెట్‌వర్క్స్‌లో యూజర్లు ఒక ఎంబీ డేటా కోసం సగటున 23 పైసలు వెచ్చిస్తున్నారని పేర్కొంది.
పీడీవో, పీడీవోఏ అంటే..
ట్రాయ్ ఒక విధానాన్ని సూచించింది. ఇక్కడ చిన్న ఎంట్రప్రెన్యూర్లు, దుకాణం యజమానులు మల్టీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ) నుంచి బ్యాండ్‌విడ్త్‌ను తీసుకుంటారు. దీన్ని తిరిగి వై–ఫై హాట్‌స్పాట్స్ ద్వారా డేటా రూపంలో చౌక ధరకు యూజర్లకు విక్రయిస్తారు. అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లను (పీడీవోఏ) ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. వీళ్లు ఐఎస్‌పీల నుంచి బ్యాండ్‌విడ్త్‌ను తీసుకొని దాన్ని పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో–హాట్‌స్పాట్ ఏర్పాటు చేసేవారు) యజమానులకు అందిస్తారు.