పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు | Stock broker SMC files for $20M public float, 'blank cheque' investor to part-exit | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు

Published Thu, Oct 23 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు

పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు

* నగదు మార్కెట్లో క్షీణిస్తున్న లావాదేవీలు
* ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పెరుగుతున్న ట్రేడింగ్ పరిమాణం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి,హైదరాబాద్: ధమాకా దీపావళి వచ్చేసింది. మూరత్ ట్రేడింగ్‌తో కొత్త సంవత్సరం ఖాతాలు తెరుచుకుంటున్నాయ్. గతేడాదితో పోలిస్తే..కొన్ని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు రాకెట్‌లా దూసుకుపోతోంది. గత నాలుగైదునెలలుగా స్టాక్‌మార్కెట్లో  ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడి   వ్యాపార పరిమాణం పెరుగుతోంది.  పది లక్షల కొత్తఇన్వెస్టర్ అకౌంట్లు రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలయిన ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌లలో ఈ ఏడాది నమోదయ్యాయి.అయితే అదేం విచిత్రమోకానీ, ఒక వైపు బ్రోకింగ్ బిజినెస్ పెరుగుతున్నా,  ఎంతో కాలంగా ఈ వ్యాపారంలో  స్థిరపడ్డ బ్రోకర్లు వైదొలగుతుండటం ఆందోళనకలిగిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో 335 మంది వ్యక్తిగత స్టాక్ బ్రోకర్లు, 136 కార్పొరేట్ బ్రోకర్లు, 5,773 మంది సబ్‌బ్రోకర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలిగారు. రిటైల్ ఇన్వెస్టర్ లావాదేవీలు ఆశించినంతగా లేకపోవడం, తక్కువ మార్జిన్లుండే ఆప్షన్ల వ్యాపారంపై డే ట్రేడర్లు ఆసక్తి చూపించడం, పెరిగిపోతున్న  నిర్వహణా వ్యయాలను తట్టుకోలేకపోవడంతో బ్రోకర్లు  వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
క్యాష్ మార్కెట్లో మందకొడి లావాదేవీలు...
మార్కెట్లో 90 శాతం వ్యాపారం కేవలం 10 మంది టాప్ బ్రోకర్ల చేతిలో ఉందని, షేర్ల లావాదేవీల్లో 90 శాతం వ్యాపారం కేవలం ఆప్షన్స్ సెగ్మెంట్‌లో జరుగుతుందని ఆర్‌ఎల్‌పీ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ మురళి తెలిపారు.గతంలో లాగా షేర్లు కొని డెలివరీ తీసుకునేవారు బాగా తగ్గిపోయారన్నారు. బ్రోకరేజీతో పాటు, సెక్యూరిటీ ట్రేడ్ టాక్స్ (ఎస్‌టీటీ), సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ లాంటి వ్యయాలతో పాటు ఒకే ఏడాది వ్యవధిలో షేర్లు కొని అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ లావాదేవీ పరిమాణంలో 15 శాతం చెల్లించాల్సిరావడంతో క్యాష్ మార్కెట్‌లో లావాదేవీలు గ ణనీయంగా తగ్గాయన్నారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో మంచి ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోందని, బ్రోకరేజ్ సంస్థలు ట్రేడర్‌ను బట్టి మార్జిన్లలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారన్నారు. ఒక్కో ట్రేడర్ జరిపే లావాదేవీల పరిమాణంబట్టి అతి తక్కువ బ్రోకరేజ్‌కూడా ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధపడుతున్నాయన్నారు.
 
ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించాలి...

స్టాక్‌మార్కెట్లో లావాదేవీలు జరిపే క్లయంట్లకు ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమిస్తోందని ప్రశాంత్ శ్రీమాలి, ఎండీ, పీసీఎస్ సెక్యూరిటీస్ తెలిపారు. తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసినంత మాత్రాన అందరూ ఆన్‌లైన్ లావాదేవీలు జరపలేరని, సాంప్రదాయబద్ధంగా షేర్ మార్కెట్ బిజినెస్‌చేసే వారు బ్రోకరేజ్ సంస్థలకు దూరం కాలేరని ఆయన చెప్పారు. గత ఏడెనిమిది దశాబ్దాలుగా తామీ వ్యాపారంలో ఉన్నామని, ఇప్పుడు కూడా తమ వ్యాపారంలో 50 శాతం ఆన్‌లైన్ ట్రేడింగ్ జరుగుతుండగా మిగతా సగం బ్రోకర్ ఇంటరాక్షన్‌తోనే జరుగుతుందన్నారు. రానున్న అడ్వైజరీ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అందిస్తే ఈ వ్యాపారంలో ఎంతకాలమైనా కొనసాగవచ్చన్నారు.  

అమెరికాలోలా ఇండియాలో ఫుల్‌సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ అనే విధానంలేదని, ఇక్కడున్నదల్లా డిస్కౌంట్‌బ్రోకరే జ్ సంస్థలేని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వివికే ప్రసాద్ సాక్షి ప్రతినిధికి తెలిపారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న స్టాక్‌బ్రోకింగ్ సంస్థలు హైస్పీడ్ ట్రేడింగ్‌కు అనుగుణంగా సేవలందించేందుకు ముంబైలో కోలొకేషన్ సర్వర్‌లను ఏర్పాటుచేసుకోలేకపోవడంతోనే ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. ఒక్కో కోలొకేషన్ సర్వర్‌కు రూ. కోటి రూపాయలు ఖర్చవుతుందని, దీనితో పాటు ముంబైలో కార్యాలయం నిర్వహించాలంటే అయ్యే ఖర్చులు అదనం కావడంతో పోటీలో నిలవలేని సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.  

చౌక ధరలే ఆకర్షణ...
ఆన్‌లైన్ ట్రేడింగ్ పుంజుకోవడంతో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుండి స్టాక్స్ కొనుగోళ్లు, విక్రయాలు జోరందుకున్నాయి. నిఫ్టీ ఆప్షన్స్ ఒక లాట్ కొనుగోలు చేయాలంటే గతంలో వంద రూపాయలు బ్రోకరేజ్ చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వినియోగం బాగా పెరగటంతో ఇప్పుడు ఒక లాట్ ఆప్షన్స్ బ్రోకరేజీ రూ. 10-20కి పడిపోయింది. దీంతో ఎక్కువ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉండే బ్రోకరేజీ సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయని జాజూ సెక్యూరిటీస్ ప్రతినిధి సంజయ్‌జాజూ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement