ఇక ప్రత్యామ్నాయాలు వెతకండి | Subrata told to get a new bailout, US saviour returns fee | Sakshi
Sakshi News home page

ఇక ప్రత్యామ్నాయాలు వెతకండి

Published Thu, Feb 12 2015 2:21 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

ఇక ప్రత్యామ్నాయాలు వెతకండి - Sakshi

ఇక ప్రత్యామ్నాయాలు వెతకండి

సహారాకు సుప్రీంకోర్టు ఆదేశం
మరోవైపు లోన్ ఒప్పంద ప్రక్రియ నిలిచిపోయినట్లు మిరాచ్ ప్రకటన
అయితే మూడు హోటళ్లను కొనడానికి ఇప్పటికీ సిద్ధమని స్పష్టీకరణ

న్యూఢిలీ/న్యూయార్క్: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్ వ్యవహారం, విదేశాల్లో ఆ గ్రూప్ హోటళ్ల విక్రయానికి సంబంధించి బుధవారం రెండు వేర్వేరు పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది- సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ. బెయిల్ విషయంలో నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సహారాకు సూచించింది. ఇక సహారాకు 2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీతో వార్తల్లోకి వచ్చిన అమెరికా సంస్థ మిరాచ్ క్యాపిటల్ ఆ గ్రూప్ (సహారా) ఆస్తులను కొనడానికి ఇప్పటికీ సిద్ధమని మరోసారి ప్రకటించింది. దాదాపు రూ.20,000 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపుల కేసులో సుబ్రతారాయ్, ఆయన సహచరులు ఇరువురు 2014 మార్చి నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.  తాజా పరిణామాల్లోకి వెళితే...
 
సుప్రీం సూచనలు...
బెయిల్‌కు రూ. 10,000 కోట్లు సమీకరించడానికి ఉద్దేశించి హోటళ్ల (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్- లండన్‌లోని గ్రాస్‌వీనర్) వాటాల విక్రయం విషయంలో మిరాచ్ కేపిటల్‌తో  రుణ ఒప్పందం ప్రతిపాదన నీరుగారిపోయిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సహారా న్యాయవాది గణేష్, అలాగే ఈ కేసులో  (సుప్రీంకోర్టుకు సలహాదారుగా) స్వతంత్ర న్యాయవాది శేఖర్ నపాడేకు కీలక సూచన చేసింది. ఇక ఆస్తుల అంశాలపై తగిన ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని చెప్పింది.

డీల్ విషయంలో జరిగిన పరిమాణాలన్నింటినీ సీనియర్ న్యాయవాది శేఖర్ నపాడే, సహారా న్యాయవాది గణేష్ అంతకుముందు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాము మిరాచ్ చేతుల్లో ఘోరంగా మోసపోయినట్లు సహారా తెలిపింది. అయితే ఆయా అంశాలన్నింటినీ లిఖిత పూర్వకంగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డీల్‌పై ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు తన రూలింగ్‌ను ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. కాగా విదేశాల్లోని తమ మూడు హోటళ్ల విక్రయానికి  విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) 1999 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగిన  క్లియరెన్సులను మంజూరు చేసిందని  సహారా బుధవారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
 
డీల్ రద్దు: మిరాచ్
మిరాచ్ కేపిటల్ తాజా ప్రకటన చేస్తూ, సహారా తో తమ లోన్ డీల్ కథ ముగిసిపోయినట్లేనని స్పష్టం చేసింది. డీల్ (డబ్బు సమీకరణ ప్రణాళికల ఖరారు నిమిత్తం) కుదర్చడానికి సంబంధించి సహారా తమకు ఇచ్చిన ఫీజు  2.62 మిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని తిరిగి సెబీ-సహారా ఫండ్‌కు చెల్లించినట్లు కూడా వెల్లడించింది. ఈ డీల్ ప్రక్రియలో తమకు దాదాపు 1.75 మిలియన్ డాలర్లు ఖర్చయినప్పటికీ, ఫీజు మొత్తాన్ని తిరిగి జమ చేసేసినట్లు పేర్కొంది.  ఫీజు తిరిగి చెల్లింపుల విషయాన్ని తెలియజేస్తూ,  ఈ కేసులో సుప్రీంకు సలహాలను అందిస్తున్న స్వతంత్ర న్యాయవాదికి, సెబీకి, సహారా ప్రతినిధులకు తమ సీఈఓ సారాంశ్ శర్మ లేఖలు రాసినట్లు తెలిపింది.

అయితే మూడు హోటళ్ల కొనుగోలకు 2.05 బిలియన్ డాలర్ల ఆఫర్‌తో తమ ఇన్వెస్టర్లు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లూ స్పష్టం చేసింది. అసలు ఆస్తులు అమ్మడానికి సహారాకు ఇష్టం లేదని మరోసారి పేర్కొన్న మిరాచ్, ఈ విషయంలో సుప్రీంకోర్టు, సెబీసహా తమ సంస్థ, ఇన్వెస్టర్ల విలువైన సమావేశాన్ని అంతా సహారా వృథా చేస్తోందని విమర్శించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకుంటున్నట్లు తెలిపింది. ఈ డీల్ ప్రక్రియ నిజానికి ఫిబ్రవరి 20వ తేదీలోగా ముగియాల్సి ఉంది. డీల్ ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో ఇక సుప్రీం తదుపరి సూచనల కోసం వేచిచూస్తామని మిరాచ్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement