ఒక షేరుతో.. ఓ బైక్ కొనొచ్చు!!
• ఐదంకెల ధరలోనూ షేర్ల పరుగులు
• రూ.50వేలు దాటేసిన ఎంఆర్‌ఎఫ్
• రాబడిలోనూ టాప్ ఈ ‘ఆరు’ గుర్రాలు
• అయినా కొనొచ్చంటున్న మార్కెట్ నిపుణులు
సాక్షి, బిజినెస్ విభాగం : ఎంఆర్‌ఎఫ్ షేర్ ధర ఇటీవలే రూ.50 వేలు దాటింది. అంటే ఒక్కొక్క షేర్ ధర అక్షరాలా అర లక్ష!!. ఈ ధరతో తులంన్నర బంగారమో, ఒక మంచి బైకో, స్కూటరో కొనుక్కోవచ్చు. ఇలా పదివేలకు మించిన ఐదంకెల షేర్లు మన స్టాక్ మార్కెట్లో అరడజను దాకా ఉన్నాయి. ఇంత ధరున్నా ఈ ఏడాది ఇవి మంచి రాబడులే ఇచ్చాయి. ధర ఎక్కువైతే డిమాండ్ తగ్గుతుందన్నది సాధారణ ఆర్థిక సూత్రం. ధర అధికంగా ఉంటే లిక్విడిటీ తగ్గి, వృద్ధి లేదా లాభాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని స్టాక్ మార్కెట్ వర్గాలు కూడా చెబుతుంటాయి. కానీ ఈ అరడజను షేర్లూ అసాధారణ వృద్ధిని సాధించాయి. ఏడాది కాలంలో స్టాక్ సూచీలు అంతంత మాత్రం వృద్ధినే సాధిస్తే, ఇవి మాత్రం 14-55 శాతం వరకూ పెరిగాయి. అసలీ షేర్లేంటి? వాటి రాబడులెంత? అధిక ధరకు కారణాలేంటి? ఇంకా కొనుగోలు చేయొచ్చా? ఈ వివరాలే ఈ కథనం...
ఎందుకింత అధిక ధర ?
దాదాపు ప్రమోటర్లంతా స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ షేరు ఎక్కువ ధరకు ట్రేడ్ కావాలనుకుంటుంటారు. కాబట్టి వారంతా తమ కంపెనీ షేర్ ధర సామాన్య ఇన్వెస్టర్‌కూ అందుబాటులో ఉండాలనుకుంటారు. ఇందుకోసం రేటు అధికం అనిపించినప్పుడల్లా, బోనస్ షేర్లు ఇవ్వటమో, షేర్లను విభజించటమో చేసి ధరను అందుబాటులోకి తెస్తారు. ఉదాహరణకు ఇన్ఫోసిస్‌ను తీసుకుంటే, ఇప్పటివరకూ ఎన్నోసార్లు బోనస్ షేర్లనిచ్చింది. విభజించింది. అలా చేయడం వల్ల ఈ షేర్ ముఖ విలువ రూ.1 గానూ, షేర్ ధర రూ.1,038గానూ ఉంది. ఒక వేళ ఇవేమీ లేకుంటే ఈ షేర్ రూ.2 లక్షల రేంజ్‌లో ఉండేది. అంత ధర ఉంటే ఇన్వెస్టర్లు ఈ షేర్ జోలికి వచ్చే వాళ్లు కాదు కదా!
కొందరు ప్రమోటర్లు మరో రకంగా ఆలోచిస్తారు. షేర్ ధర అందరికీ అందుబాటులో ఉంటే, లిక్విడిటీ పెరిగి హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయని, చిన్న ఇన్వెస్టర్ల దగ్గర ఎక్కువ షేర్లుంటే, చీటికి, మాటికీ చిల్లర కారణాలకే వాటిని విక్రయిస్తారని, షేర్ ధర పడిపోతుందని వారి అభిప్రాయం. అందుకని తమ షేర్లకు బోనస్‌లు ఇవ్వరు. విభజన చేయరు. ఫలితంగా వారి షేర్ ధర అంతకంతకూ పెరిగిపోతుంటుంది.
బోనస్ ఇవ్వకపోవడం, విభజించకపోవటం, తక్కువ ఈక్విటీ, తక్కువ ఫ్లోటింగ్ షేర్లు వంటి కారణాల వల్లే కొన్ని షేర్లు రూ.10వేలకు మించి ధర ఉన్నాయి. ఉదాహరణకు ఎంఆర్‌ఎఫ్‌కు మార్కెట్లో 42 లక్షల షేర్లు... రూ.4 కోట్ల ఈక్విటీ ఉండగా, ఇన్పోసిస్‌కు 228 కోట్ల షేర్లు, రూ.1,148 కోట్ల ఈక్విటీ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇన్ఫోసిస్‌ది రూ.2,38,469 కోట్లుగా ఉండగా, ఎంఆర్‌ఎఫ్ మార్కెట్ క్యాప్ రూ.21,892 కోట్లుగానే ఉంది. చిత్రమేంటంటే మన మార్కెట్లోని ఈ అరడజను షేర్లూ ఐదేళ్లలో అద్భుతమైన రాబడులనిచ్చాయి.
ధర అధికమే... రిస్కూ అధికమే!
ఇతర షేర్లతో పోల్చితే ఈక్విటీ తక్కువగా ఉన్న ఈ షేర్లలో ఒడిదుడుకులు తక్కువే ఉంటాయి. ఎందుకంటే షేర్ హోల్డింగ్ కొద్ది మందిచేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా వీళ్లంతా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లై ఉంటారు కనక ఆపరేటర్లు సులభంగా ఆపరేట్ చేయలేరు. లిక్విడిటీ లేకపోవటం వల్ల షేర్ల ధరల్లో స్వల్పకాలంలో తీవ్రమైన ఒడిదుడుకుల్లాంటివి ఉండవు. షేర్ల విభజన లేకపోవడం, బోనస్ షేర్లు ఇవ్వకపోవడం వల్ల ఈక్విటీపై పరిమితి ఉంటుంది. షేర్ల సరఫరా తక్కువగా ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉంటుంది కనక షేర్ ధర పెరిగే అవకాశాలుంటాయి.
ధర అధికంగా ఉందనే కారణంతో ఇలాంటి షేర్లకు దూరంగా ఉండడం సరికాదన్నది నిపుణుల మాట. ధర ఎక్కువైనప్పటికీ కంపెనీ వ్యాపారం బావున్నా, భవిష్యత్ వ్యాపార అంచనాలు ఆశావహంగా ఉన్నా ఈ షేర్లను నిరభ్యంతరంగా కొనొచ్చన్నది వారి సూచన. కంపెనీ నిర్వహణ, అమ్మకాలు, నికర లాభం తదితర ఫండమెంటల్స్ క్షుణ్నంగా పరిశీలించి అవన్నీ బాగుంటే ధర అధికంగా ఉన్నా కూడా ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చన్నది వారి విశ్లేషణ. రిస్క్ అధికంగా ఉంటుంది కనక దాన్ని భరించగలిగితేనే ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమనేది వారి మాట.