న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్ డబ్బులను పూర్తిగా వాపసు ఇవ్వకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు దృష్టి సారించింది. పూర్తి సొమ్ము వెనక్కు ఇచ్చేలా విమానయాన సంస్థలకు ఆదేశాలకు ఇవ్వాలని దాఖలైన ఒక పిటిషన్‌పై పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)లకు నోటీసులు జారీ చేసింది. ‘ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా’ రద్దయిన ప్రయాణ టిక్కెట్ డబ్బును తరువాత వినియోగించడానికి ఉద్దేశించిన ‘క్రెడిట్ షెల్’ యంత్రాంగంలోకి మళ్లించడం ‘చట్ట విరుద్ధమని’ పిటిషన్ సుప్రీంకు విన్నవించింది. ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించి నోటీసులకు ఆదేశాలిచ్చింది. కోవిడ్–19 నేపథ్యంలో రద్దయిన విమాన టికెట్ల డబ్బును వెనక్కు ఇచ్చే విషయంలో సంయుక్తంగా కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలని పౌర విమానయాన శాఖ, ఎయిర్‌లైన్స్‌కు జూన్ మొదట్లో సుప్రీం సూచనలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment