అమెరికా, చైనాల మధ్య సుంకాల యుద్ధం మరో స్థాయికి చేరడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ రెండు దేశాల వాణిజ్య యుద్ధం మరింతగా ప్రజ్వరిల్లుతుందనే భయాందోళనలతో మన మార్కెట్ కూడా బుధవారం భారీ స్థాయిలో నష్టపోయింది. దీంతో వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ తొలి నష్టాన్ని.. భారీ స్థాయిలో నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 33 వేల దిగువకు పడిపోయినప్పటికీ, చివరకు 33 వేల పాయింట్లపైన ముగియగలిగింది. నిఫ్టీ మాత్రం కీలకమైన 10,150 పాయింట్ల దిగువకు పతనమైంది. ప్రధాన స్టాక్ సూచీలు చెరొక శాతం చొప్పున నష్టపోయాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలు నేడు(గురువారం) వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు పొజిషన్లు తీసుకోవడానికి వెనకాడటం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 352 పాయింట్ల నష్టంతో 33,019 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 10,128 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఒక్క వాహన సూచీ మినహా, మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.
లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ పడుతూ, లేస్తూ మెల్లమెల్లగా మధ్యాహ్నం కల్లా 135 పాయింట్ల లాభంతో 33,506 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటన రావడంతో మన మార్కెట్లో ఆకస్మిక పతనం చోటు చేసుకుంది. ఒక దశలో 398 పాయింట్ల నష్టంతో 32,973 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఒక దశలో 35 పాయింట్లు లాభపడగా, మరో దశలో 134 పాయింట్లు పతనమైంది.
మరికొంత కాలం ఒడిదుడుకులు...
వాణిజ్య యుద్ద ఉద్రిక్తతల కారణంగా ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, స్టాక్ మార్కెట్ 2 శాతం నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో అప్రమత్తత నెలకొనడం సైతం తగిన ప్రభావం చూపించిందన్నారు. సమీప భవిష్యత్తు సెంటిమెంట్‌కు తోడ్పాటునిచ్చేలా ఆర్‌బీఐ పాలసీ ఉండే అవకాశాలున్నాయని, అయితే కంపెనీల క్యూ4 ఫలితాలు, వర్షాలు... మార్కెట్ గమనంపై తగిన స్పష్టతనిస్తాయని పేర్కొన్నారు. సుంకాల విధింపు కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని షేర్‌ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా పేర్కొన్నారు. ఇది అన్ని దేశాలనూ నష్టపరుస్తుందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని, భారత్ మినహాయింపేమీ కాదని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన లార్జ్ క్యాప్, క్వాలిటీ గల మిడ్ క్యాప్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. మార్కెట్లో ఒడిదుడుకులు మరికొంత కాలం కొనసాగుతాయని, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడం కొనసాగుతుందని కొందరు నిపుణులు హెచ్చరించారు.
పతన బాటలో ప్రపంచ మార్కెట్లు...
వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లన్నీ దాదాపు నష్టపోయాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2.1 శాతం, కోస్పి 1.4 శాతం, షాంగై ఇండెక్స్ 0.1 శాతం, సింగపూర్ 2.1 శాతం చొప్పున పడిపోగా జపాన్ నికాయ్ మాత్రం స్వల్పంగా లాభపడింది. ఇక యూరప్ మార్కెట్లు నష్టాలతో ఆరంభమయ్యాయి. చివరకు మిశ్రమంగా ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమైనా, ఆ తర్వాత కోలుకుని స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఎదురీదిన టాటా మోటార్స్
స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, టాటా మోటార్స్ మాత్రం 3.6 శాతం లాభంతో రూ.356 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. నిఫ్టీలో 8 షేర్లు, సెన్సెక్స్‌లో ఆరు షేర్లు–టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, హీరో మోటొకార్ప్, హిందుస్తాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్, ఐటీసీలు మాత్రమే లాభపడ్డాయి. టాటా స్టీల్ 3.2 శాతం నష్టంతో రూ.560 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. యాక్సిస్ బ్యాంక్ 2.6 శాతం నష్టపోగా, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, షేర్లు 2.5 శాతం వరకూ నష్టపోయాయి.
ఆల్‌టైమ్ హైకి వి–మార్ట్
స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా వి–మార్ట్ రిటైల్ షేర్ ఇంట్రాడేలో 20 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.2,325ని తాకింది. చివరకు 11 శాతం లాభంతో రూ.2,164 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3 ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ షేర్ బాగా పెరుగుతోంది. ఏడాది కనిష్ట స్థాయి రూ.854గా ఉన్న ఈ కంపెనీ షేర్ రెండు నెలల్లో 60 శాతం లాభపడడం విశేషం.
అసలు కారణం...
మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే చైనా వస్తువులపై సుంకాలు విధించారు. ఎల్‌ఈడీలు, రసాయనాలు, యంత్ర భాగాలు వంటి పారిశ్రామిక, రవాణా, హై టెక్నాలజీ, వైద్య సంబంధిత మొత్తం 5,000 కోట్ల డాలర్ల విలువైన 1,300 చైనా ఉత్పత్తులపై 25 శాతం మేర సుంకాలను అమెరికా విధించింది. దీనికి ప్రతిగా చైనాకు దిగుమతయ్యే 106 అమెరికా ఉత్పత్తులపై 25 శాతం చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. సోయాబీన్, కార్లు, విమాన విడిభాగాలు, విస్కీ రసాయనాలు తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సుంకాల కారణంగా 5,000 కోట్ల డాలర్ల అమెరికా దిగుమతులపై ప్రభావం పడనున్నది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ సుంకాల పోరు మరింతగా పెరిగి అంతర్జాతీయ ఆర్థిక రికవరీకి అవరోధం కాగలదనే ఆందోళన నెలకొంది.
కొసరు కారణం...
బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఆరంభమైన ఆర్‌బీఐ మోనేటరీ పాలసీ సమావేశం నేడు (గురువారం) ముగుస్తుంది. నేడు కీలక రేట్లపై నిర్ణయాన్ని ఆర్‌బీఐ వెల్లడిస్తుంది. కీలక రేట్లపై యథాతథ స్థితి కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే రేట్ల కోత ఉండొచ్చన్న స్వల్ప ఆశలు ఉన్నాయి.
1.2 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ భారీ పతనంతో ఇన్వెస్టర్ల సం పద రూ.1.2 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కె ట్ క్యాపిటలైజేషన్ రూ.145.33 లక్షల కోట్ల నుంచి రూ.144.13 లక్షల కోట్లకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment