
జోరుగా పన్ను వసూళ్లు
పన్ను ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది.
♦ ఈ ఆర్థిక సంవత్సరం
♦ మూడు నెలల్లో చెప్పుకోదగ్గ వృద్ధి
♦ 31% పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
♦ 25% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ : పన్ను ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. ఆర్థిక కార్యకలాపాల జోరును పెరిగిన పన్ను ఆదాయం ప్రతిబింబిస్తోందని నిపుణులంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలానికి పరోక్ష పన్ను వసూళ్లు 31 శాతం వృద్ధితో రూ.1,99,790 కోట్లకు, ప్రత్యక్ష పన్నులు 25 శాతం వృద్ధితో రూ.1.24 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం మీద అన్ని పన్నుల వసూళ్లు రూ.3.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఎక్సైజ్ పన్ను వసూళ్లు 50 శాతం పెరగడం, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల కారణంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు పెరగడం వల్ల ఈస్థాయిలో పన్ను ఆదాయం లభించింది.
దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నులు 25.7 శాత ం, పరోక్ష పన్నులు 14.63 శాతం పెంచుకోవాలన్న బడ్జెట్ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.47 కోట్ల లక్షల ప్రత్యక్ష పన్ను వసూళ్లు, రూ.7.79 లక్షల కోట్లు పరోక్ష పన్ను వసూళ్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ పన్నులను కలిపి పరోక్ష పన్నులుగా పరిగణిస్తారు. పన్ను వసూళ్లకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు.
⇔ వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 29.8 శాతం, కార్పొరేట్ పన్ను వసూళ్లు 13.5 శాతం చొప్పున పెరిగాయి.
⇔ వ్యక్తులకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు నిబంధనల్లో మార్పు కారణంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు అడ్వాన్స్ ట్యాక్స్‌ను నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌లో 15 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం, డిసెంబర్‌లో 30 శాతం, మార్చిలో 25 శాతం చొప్పున అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ చెల్లింపు మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలోనే(సెప్టెంబర్, డిసెంబర్, మార్చి) ఉండేది.
⇔ ఏప్రిల్-జూన్ కాలానికి పరోక్ష పన్ను వసూళ్లు 31 శాతం వృద్ధితో రూ.1,99,790 కోట్లకు పెరిగాయి.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,52,740 కోట్ల వసూళ్లు జరిగాయి.
⇔ ఇక జూన్ నెలలో.. మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు 20 శాతం వృద్ధితో రూ.67,755 కోట్లకు పెరిగాయి. గత ఏడాది జూన్‌లో మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు రూ.56,277 కోట్లుగా ఉన్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ పన్ను వసూళ్లు 41 శాతం వృద్ధితో రూ.30,982 కోట్లకు పెరిగాయి.