‘జియో’ ముడి వీడిందా!!
• ఇంటర్ కనెక్షన్ వివాదంపై ఎవరి వాదన వారిదే
• ట్రాయ్ భేటీకి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా హాజరు
• సేవలు దెబ్బతినకుండా సమస్య పరిష్కరించుకోవాలన్న ట్రాయ్
• సీఓఏఐ ప్రతినిధులకు రాని పిలుపు; ఇది జియో పనే: మాథ్యూస్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, ప్రస్తుత టెలికం కంపెనీల మధ్య పోరు తారస్థాయికి చేరింది. ప్రధానంగా మొబైల్ నెట్‌వర్క్ ఇంటర్‌కనెక్షన్ విషయంలో తలెత్తిన వివాదాన్ని చర్చించేందుకు నియంత్రణ సంస్థ ట్రాయ్ శుక్రవారం సమావేశం నిర్వహించింది. దీనికి జియోతో పాటు దిగ్గజ టెల్కోలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా ప్రతినిధులు హాజరయ్యారు. మొబైల్ వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో నాణ్యత దెబ్బతినకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ ట్రాయ్ కార్యదర్శి సుధీర్ గుప్తా టెల్కోలకు సూచించినట్లు సమాచారం.
అయితే, ఈ భేటీకి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) ప్రతినిధులను ట్రాయ్ ఆహ్వానించకపోవడం గమనార్హం. సమావేశంలో కంపెనీల ప్రతినిధులు ట్రాయ్‌కి తమతమ వాదనలను వినిపించారు. మరోపక్క, ఆపరేటర్లు జియోతో విడివిడిగా సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించినట్లు సీఓఏఐ పేర్కొంది. జియోకు తగిన ఇంటర్‌కనెక్టివిటీ సామర్థ్యం పెంచడానికి ప్రస్తుత టెల్కోలు సంప్రదింపులు జరుపుతాయని.. అయితే, ఒప్పందం ప్రకారం జియో విజ్ఞప్తి చేసిన 90 రోజుల్లో ఈ చర్యలకు ఆస్కారం ఉంటుందని తెలిపింది.
న్యాయం కోసం పోరాటం: జియో
దాదాపు గంటపాటు జరిగిన భేటీ అనంతరం జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా విలేకరులతో మాట్లాడారు. ‘మా మొబైల్ నెట్‌వర్క్ నుంచి కాల్స్‌ను తమ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి సరిపడా పోర్ట్స్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్(పీఓఐ) పరికరాలను ప్రస్తుత టెల్కోలు అందుబాటులో ఉంచడం లేదని ట్రాయ్‌కు తెలిపాం. దీనివల్ల జియో కస్టమర్లు కాల్‌డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించాం. ఇక ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సింది ట్రాయ్ అధికారులే. అయితే, ఇందుకు నిర్ధిష్ట కాల వ్యవధిని ట్రాయ్ సమావేశంలో సూచించలేదు. కస్టమర్ల తరఫున మేం న్యాయం కోసమే పోరాడుతున్నాం’ అని పేర్కొన్నారు.
అసాధారణ విషయం: సీఓఏఐ
తాజా భేటీకి తమను ఆహ్వానించకపోవడం అసాధారణమైన విషయమని, జియో ఒత్తిడి కారణంగానే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మాథ్యూస్ ఆరోపించారు. ఈ ఆరోపణలను నహతా ఖండించారు. మరోపక్క, సీఓఏఐ ఆరోపణలకు ట్రాయ్ కూడా తీవ్రంగా స్పందించింది. జియో ఒత్తిడి కారణంగానే సీఓఏఐ ప్రతినిధులను సమావేశానికి పిలవలేదంటూ డెరైక్టర్ జనరల్ చేసిన ప్రకటన నిరాధార, హానికరమైనదిగా పేర్కొంది. దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ సీఓఏఐ చైర్మన్ గోపాల్ విట్టల్‌కు ట్రాయ్ లేఖ రాసింది.
ఉచిత ‘ట్రాఫిక్’ సునామీని అడ్డుకోండి: ఎయిర్‌టెల్
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లపై ఎయిర్‌టెల్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘‘ఇష్టానుసారంగా ఇస్తున్న ఉచిత కాల్స్ ట్రాఫిక్ సునామీతో ఇతర కంపెనీల నెట్‌వర్క్‌లకు విఘాతం కలుగుతుంది. అలా జరగకుండా జియోను నిలువరించాలని ట్రాయ్‌ను కోరాం. ఇందుకు ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీల (ఐయూసీ) అస్త్రాన్ని ట్రాయ్ న్యాయబద్ధంగా ఉపయోగిస్తుందని భావిస్తున్నాం. జియోకు తగిన ఇంటర్‌కనెక్షన్‌ను కల్పించటంపై నిర్మాణాత్మక చర్చలకు ఆస్కారం కల్పించినందుకు ట్రాయ్‌కు కృతజ్ఞతలు. కాకుంటే నిబంధనల ప్రకారం ఐయూసీ ప్రైసింగ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ట్రాయ్‌కి ఉంది. బాధ్యతగల టెలికం కంపెనీగా ఇతర ఆపరేటర్లకు తగిన ఇంటర్‌కనెక్టివిటీని కల్పించడంలో మేమెప్పుడూ నిబంధనలు, లెసైన్స్ షరతుల మేరకే నడుచుకుంటాం. జియో పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమైతే ట్రాఫిక్ సమతౌల్యం మెరుగుపడుతుంది. అప్పటివరకూ జియోతో ఒప్పందం మేరకు తగినన్ని పీఓఐల ఏర్పాటుకు మేం చర్యలు తీసుకుంటాం’’ అని ఎయిర్‌టెల్ వివరించింది.
వివాదం ఇదీ...
ఒక టెలికం కంపెనీకి చెందిన కస్టమర్ మరో టెలికం కంపెనీకి చెందిన కస్టమర్‌కు కాల్ చేయటమనేది సాధారణం. ఉదాహరణకు ఎయిర్‌టెల్ కస్టమరు ఐడియా కస్టమర్‌కు ఫోన్ చేయటం వంటిదన్నమాట. ఇలా కాల్ చేసినపుడు నెట్‌వర్క్‌ను అనుసంధానించాలి కనక ఇంటర్‌కనెక్షన్ అవసరం. నిబంధనల ప్రకారం టెల్కోలు పరస్పర అవగాహన ఒప్పందం ప్రకారం ఈ సదుపాయాన్ని కల్పించాలి. దీనిపై ఏదైనా వివాదం తలెత్తితే ట్రాయ్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాగా, ఈ నెల 5 నుంచి 4జీ సేవలను ప్రారంభించిన జియో... డిసెంబర్ 31 వరకూ వాయిస్, డేటా అన్నీ ఉచితంగా అందిస్తామని ప్రకటించడం తెలిసిందే.
పూర్తిస్థాయి వాణిజ్య సేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించనుంది. అప్పటి నుంచీ టారిఫ్‌లను వసూలు చేస్తామని వెల్లడిం చింది. అయితే ప్రస్తుతం తమ సర్వీసులను అడ్డుకోవడానికి ప్రస్తుత టెల్కోలు కావాలనే కుట్రపూరితంగా ఇంటర్‌కనెక్షన్‌ను సరిపడా ఇవ్వడం లేదని.. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని జియో చెబుతోంది. కాకపోతే జియో ఇష్టానుసారంగా ఉచిత సేవలను అందించడవల్ల వచ్చే కాల్స్ సునామీకి సరిపడా ఇంటర్‌కనెక్షన్‌ను అందించలేకపోతున్నట్లు అవి చెబుతున్నాయి.
దీంతో వివాదం తీవ్రతరమైంది. ఇప్పుడున్న టెల్కోల తరఫున పోరాడుతున్న సీఓఏఐ... ట్రాయ్‌తోపాటు ప్రధాని కార్యాలయానికి కూడా లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రాయ్ సమావేశం నిర్వహించింది. కాగా, ప్రస్తుతం అందిస్తున్నవి వాణిజ్య సేవలా కాదా అనేది స్పష్టత ఇవ్వాలని.. ఒకవేళ వాణిజ్య సేవలయితే 90 రోజులకు మించి ఉచిత సర్వీసులనివ్వడం కుదరదనేది టెల్కోల వాదన.