మూడు వారాల కనిష్టం
♦ షెల్ కంపెనీలపై సెబీ ఆదేశాలతో పెరుగుతున్న ఆందోళన
♦ అంతర్జాతీయ సంకేతాల బలహీనత
♦ సెన్సెక్స్ 216 పాయింట్లు,
♦ నిఫ్టీ 70 పాయింట్లు డౌన్
అనుమానాస్పద షెల్ కంపెనీలపై ట్రేడింగ్ నిషేధించాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెబీ జారీచేసిన ఆదేశాల ప్రభావంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా వుండటంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు క్షీణించింది. స్టాక్ సూచీలు మూడు వారాల కనిష్టస్థాయిలో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ బుధవారం మరో 216 పాయింట్లు తగ్గి 31,798 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 528 పాయింట్ల పతనమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70.50 పాయింట్లు క్షీణించి 9,908 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఉత్తర కొరియా–అమెరికాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లు కూడా తగ్గాయని, ఇప్పటికే సెబి ఆదేశాలతో అట్టుడుకుతున్న మార్కెట్‌కు ప్రపంచ ట్రెండ్ ఆజ్యం పోసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. హెల్త్‌కేర్, ఫార్మా నేతృత్వంలో అన్ని రంగాల సూచీలు తగ్గుదలతో ముగిసాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెబీ ఆదేశాల ప్రభావంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచి 1.66 శాతం, స్మాల్‌క్యాప్ సూచి 1.88 శాతం మేర తగ్గాయి.
ఫార్మా షేర్లు అతలాకుతలం...
కొద్దిరోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న ఫార్మా షేర్ల పతనం బుధవారం కూడా కొనసాగింది. సన్‌ఫార్మా అమెరికా సబ్సిడరీ టారో ఫార్మాస్యూటికల్స్ బలహీనమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో సన్‌ఫార్మా 5 శాతంపైగా పతనమై 4 సంవత్సరాల కనిష్టస్థాయి రూ. 470 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్–30లో అధికంగా క్షీణించిన షేరు ఇదే. ఇతర ఫార్మా షేర్లలో నిఫ్టీ–50లో భాగమైన అరబిందో ఫార్మా 6 శాతం పతనమై రూ. 683 వద్ద క్లోజయ్యింది. సిప్లా 3.5 శాతం, లుపిన్ 2.5 శాతం చొప్పున తగ్గాయి. ప్రధాన సూచీల్లో భాగంకాని కెడిలా హెల్త్‌కేర్ 9 శాతం, గ్రాన్యూల్స్ ఇండియా 7.8 శాతం, అజంతా ఫార్మా, దివీస్ ల్యాబ్‌లు 7 శాతం చొప్పున పడిపోయాయి. తగ్గిన ఇతర రంగాల షేర్లలో అదాని పోర్ట్స్ (4 శాతం), టాటా మోటార్స్, బజాజ్ ఆటోలు వున్నాయి. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీలు స్వల్పంగా పెరిగాయి.