ప్రతీకాత్మక చిత్రం
కార్మికులు బండరాళ్లను పగలగొట్టేందుకు చెమటోడుస్తుంటే.. దాన్ని గమనించిన ఓ శాస్త్రవేత్త బాంబును కనిపెట్టాడట. మానవుడి శ్రమను తగ్గించడానికి కనిపెట్టిన అవే బాంబులు ఇప్పుడు మనిషి వినాశనానికి కారణమవుతున్నాయి. ఇలా ఎన్నో మంచి ఆవిష్కరణలు కూడా çసద్వినియోగం కంటే ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా చేరుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
సాక్షి, ప్రత్యేకం : పెరుగుట.. విరుగుట కొరకేనన్న మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుందేమో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు.. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తున్నారు. యంత్ర సామగ్రిని, మానవ అవయవాలను, చివరికి ఆహార పదార్థాలను కూడా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారుచేస్తున్నారు. ఫలితంగా ఎంతో సమయం ఆదా కావడంతోపాటు ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీని మానవాళి సంక్షేమానికి ఉపయోగించినన్ని రోజులూ ఏ ముప్పూ లేదని.. ఆలోచనలు పక్కదారి పడితే మాత్రం అది మానవ వినాశనానికే దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
ఆయుధాల తయారీతో ముప్పే..
ఆటబొమ్మలు, యంత్ర సామగ్రి, కృత్రిమ అవయవాలు, రకరకాల ఆకారాల్లో ఆహార పదార్థాలు.. ఇలా ఎన్నింటినో తయారుచేస్తున్న 3డీ ప్రింటర్‌కు ఆయుధాలను తయారు చేయడం పెద్ద లెక్కకాదు. ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడే దేశాలకు ఈ టెక్నాలజీ ఓ వరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వేల కోట్ల రూపాయలను విదేశాలకు చెల్లించాల్సిన అవసరం లేకుండా సొంతంగానే ఆయుధాలను తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు.
దీనివల్ల మిగిలే ప్రజాధనాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ టెక్నాలజీ అక్రమార్కుల చేతిలో పడితే.. చిన్న చిన్న దేశాలు కూడా విచ్చలవిడిగా ఆయుధాలు తయారు చేసుకుంటే.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూడా సొంతంగా ఓ 3డీ యంత్రాన్ని కొనుక్కొని తమ ఆయుధాలను తామే తయారు చేసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
వినాశనమే తప్ప మిగిలేదేమీ ఉండదు..
పెద్దగా ఆయుధాలు అందుబాటులో లేని రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఎంతగా వినాశనం జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తమ ఆయుధ సంపత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచేసుకున్నాయి. ఇక చిన్న చిన్న దేశాలు కూడా ఆయుధాలను సమకూర్చుకొని, యుద్ధాలకు కాలు దువ్వితే.. ఊహకందని నష్టం జరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బూడిదే తప్ప మనుషులెవరూ మిగలరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment