సాక్షి, ముంబై: టాటా గ్రూప్ సంస్థ టైటాన్ కంపెనీ లిమిటెడ్ మంగళవారం క్యూ 1 ఫలితాల్లో మెరుగైన ప్రదర్శనను కనబర్చింది. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభాలు 11 శాతం ఎగిసి 364 కోట్లుగా నమోదయ్యాయి. రూ .370.7 కోట్ల స్టాండ్‌ఎలోన్ లాభాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ప్రకటించిన స్టాండ్ ఎలోన్ లాభం రూ. 349.2 కోట్ల కంటే 6.2 శాతం అధికం. ఆదాయం 14.4 శాతం పెరిగి రూ .4,939.7 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .4,319 కోట్లుగా ఉంది. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనంకు ముందు ఆదాయం (ఇబిఐటిడిఎ) 14.1 శాతం పెరిగి రూ. 565.3 కోట్లకు చేరుకోగా, మార్జిన్ మాత్రం ఫ్లాట్ 11.4 శాతంగానే ఉంది.
కంపెనీ ఇతర ఆదాయం రూ .56 కోట్లుగా నమోదుకాగా, ఆర్థిక ఖర్చులు రూ.68.1 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో ఆభరణాల విభాగంలో ఈ కంపెనీ 13.3 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. గడియారాల వ్యాపారంలో ఆదాయం, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .594 కోట్లు ఉండగా, ఈ త్రైమాసికం నాటికి 20.04 శాతం పెరిగి రూ .715 కోట్లకు చేరుకుంది. కళ్లజోడు వ్యాపారం 13.1 శాతం పెరిగి రూ.149 కోట్లకు చేరుకోగా, ఉపకరణాలు, సుగంధ ద్రవ్యాలు, చీరలతో కూడిన ఇతర వ్యాపారాలు 37.9 శాతం పెరిగి రూ.36 కోట్లకు చేరుకున్నాయి. తక్కువ వినియోగంతో పాటు స్థూల-ఆర్థిక వాతావరణం, తమ వ్యాపారాలలో కొన్నింటిని ప్రభావితం చేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ తెలిపారు. టైటాన్ షేరు విలువ మంగళవారం ట్రేడింగ్‌లో 0.50 శాతం పెరిగి రూ. 1,042.00 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment