ఐటీకి కరెన్సీ కుదుపులు!
క్యూ3లో ఆదాయాల వృద్ధి అంతంతే!
* రేపు ఇన్ఫోసిస్ ఫలితాలతో బోణీ...
* సీజనల్‌గానూ ఈ త్రైమాసికం ఐటీ కంపెనీలకు నిరుత్సాహకరం...
* పరిశ్రమ విశ్లేషకుల అంచనా...
ముంబై: దేశీ ఐటీ రంగానికి డిసెంబర్ క్వార్టర్ నిరుత్సాహకరంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కరెన్సీల మధ్య మారకపు విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు... కంపెనీల పనితీరుపై ప్రభావం చూపనున్నాయనేది వారి అంచనా. దీనికితోడు సాధారణంగా ఈ త్రైమాసికంలో అమెరికా, యూరప్ ఇతరత్రా ప్రధాన మార్కెట్లలో అధిక సెలవులు ఇతరత్రా సీజనల్ అంశాలు కూడా తోడవుతాయని.. దీనివల్ల ఆదాయాలు మందగించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ నెల 9న(శుక్రవారం) ప్రకటించనున్న ఫలితాలతో ఈ ఏడాది మూడో త్రైమాసికం(2014-15, క్యూ3) ఫలితాల సీజన్ మొదలుకానుంది. 15న ఐటీ అగ్రగామి టీసీఎస్, 16న విప్రో క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి.
డాలరుతో యూరో క్యూ3లో 6%, పౌండ్ 5%, ఆస్ట్రేలియా డాలరు 7.8% చొప్పున క్షీణించాయి. మన ఐటీ కంపెనీలకు అమెరికా(70%) తర్వాత యూరప్ అతిపెద్ద మార్కెట్‌గా(20%) నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కరెన్సీ విలువలు పతనం కావడం ఐటీ కంపెనీల డాలరు ఆదాయాలను దెబ్బతీయనుంది. ఎందుకంటే.. ఇతర కరెన్సీల్లో వచ్చిన ఆదాయాన్ని భారతీయ కంపెనీలు డాలర్లలోకి మార్చుకొని ఫలితాల్లో చూపించడమే దీనికి ప్రధాన కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఇతర కరెన్సీలు బాగా క్షీణించినందున, ఆ దేశాల నుంచి ఒనగూడే ఆదాయం డాలర్ల రూపంలో తగ్గుతుంది. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత నేపథ్యంలో ఐటీ కంపెనీల మార్జిన్లలో కాస్త మెరుగుదల కనబడొచ్చనేది వారి అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ డాలర్ల నుంచి మార్చడం వల్ల రూపాయిల్లో ఆదాయం పెరుగుతుంది. క్యూ3లో రూపాయి విలువ 2.7 శాతం తగ్గింది.
ఇన్ఫీ గెడైన్స్ తగ్గిస్తుందా..?
కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా ఇన్ఫోసిస్ ఈ ఏడాది పూర్తి కాలానికి ఇచ్చిన ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)6.75-8.75 శాతానికి తగ్గించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ తాజా నోట్‌లో పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫీ 7-9% డాలరు ఆదాయ గెడైన్స్‌ను ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, క్యూ3లో కంపెనీ డాలరు ఆదాయ వృద్ధి 1-3%కే(క్యూ2తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా) పరిమితం కావచ్చనేది విశ్లేషకుల అంచనా.
క్యూ2లో సీక్వెన్షియల్ ఆదాయ వృద్ధి అంచనాలను మించి 3.1 శాతంగా నమోదుకావడమే కాకుండా... ఒక షేరుకి మరో షేరు(1:1) బోనస్‌గా కూడా ప్రకటించడం విశేషం. కంపెనీ సీఈఓగా తొలిసారి ప్రమోటరేతర వ్యక్తి(విశాల్ సిక్కా) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇన్ఫీ మళ్లీ పూర్వవైభవం దిశగా వెళ్తోందని పలువురు నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, గడచిన రెండు క్వార్టర్లలో కరెన్సీ కుదుపుల కారణంగా ఇన్ఫీ ఆదాయ గెడైన్స్ 2014-15లో 7 శాతానికి పరిమితం కావొచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది.
ఇతర దిగ్గజాల పరిస్థితేంటి...
క్యూ3 సీజనల్‌గా బలహీన ధోరణి ఉంటుందని.. అధిక సెలవుల కారణంగా కీలక మార్కెట్లలోని కొన్ని ప్రధాన రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే ఆదాయాలపై ప్రభావమే కారణమంటూ టీసీఎస్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. దీనికితోడు కరెన్సీ కుదుపులు కూడా తోడవుతాయని డాయిష్ బ్యాంక్ విశ్లేషకుడు అనిరుద్ధ భోశాలే చెప్పారు. ఇన్ఫోసిస్, విప్రో కంటే టీసీఎస్‌పై ఈ అంశాలు అధిక ప్రభావం చూపొచ్చన్నారు.
టీసీఎస్ డాలరు ఆదాయాల వృద్ధి క్యూ3లో 0.8%కే(సీక్వెన్షియల్‌గా) పరిమితం కావచ్చనేది డాయిష్ బ్యాంక్ అంచనా. అదేవిధంగా హెచ్‌సీఎల్ టెక్ మార్జిన్లపైనా కరెన్సీ ప్రతికూలతలు ప్రభావం చూపనున్నాయని.. కంపెనీ వేతన పెంపులు డిసెంబర్ క్వార్టర్‌లో ప్రతిబింభించడం కూడా దీనికి మరో కారణంగా పరిశీలకులు చెబుతున్నారు.
ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా డాలర్లలో 1.2 శాతంగా ఉంటుందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అయితే, టెక్ మహీంద్రా మాత్రం కాస్త మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందని.. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో డాలరు ఆదాయాల్లో వృద్ధి 3.8%గా అంచనా వేసింది. అయితే, స్థిర కరెన్సీ ప్రాతిపదికన దేశీ టాప్ కంపెనీల ఆదాయాల వృద్ధి 2.2-3.5% మేర ఉంటుందన్న అంచనాలున్నాయి.