కస్టమర్లదే అంతిమ నిర్ణయం!
షాపింగ్ ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా అనే విషయంలో..
ఆన్‌లైనే కాదు ఆఫ్‌లైన్ స్టోర్లతోనూ ఒప్పందం చేసుకున్న మై స్మార్ట్ ప్రైస్ ధరలు, రివ్యూలు, రేటింగ్‌లు, ఈఎంఐ వంటి వివరాలెన్నో.. రూ.100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టిన మై స్మార్ట్ ప్రైస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
‘‘జస్విత్.. రూ.10,624 పెట్టి ఆన్‌లైన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో సెల్‌ఫోన్ కొన్నాడు. అలా కొని ఇంట్లోంచి బయటికొచ్చాడో లేదా సరిగ్గా ఇంటికెదురుగా ఉన్న మొబైల్ స్టోర్‌లో దానికంటే రూ.500 తక్కువకే ఆ ఫోనుంది’’
‘‘నందిత.. రూ.19,900 పెట్టి ఆన్‌లైన్‌లో 32 ఇంచుల ఎల్‌జీ ఎల్‌ఈడీ టీవీ కొన్నది. తనది అదే పరిస్థితి. ఆన్‌లైన్‌లో కంటే బయటే రేటు తక్కువుంది’’
ఇలాంటి సంఘటన లు మనలో చాలా మందికి అనుభవమే. సెల్‌ఫోన్, టీవీ వంటివి మాత్రమే కాదండోయ్.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కిడ్స్ అండ్ ఉమెన్ యాక్సెసరీలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా ప్రతి ఒక్క ఉత్పత్తుల ధరలు ఆన్‌లైన్‌లో ఎంతున్నాయో? ఆఫ్‌లైన్‌లో ఎంతున్నాయో తెలిస్తే బాగుంటుంది కదూ!!
అచ్చం ఇలాంటి అవకాశాన్నే కల్పిస్తోంది మై స్మార్ట్ ప్రైజ్. షాపింగ్ చేయాలనుకునే వాళ్లు ఆన్‌లైన్‌లో చేయాలా.. లేక ఆఫ్‌లైన్‌లో చేయాలా అనేది వారి నిర్ణయమేనంటున్నారు మై స్మార్ట్ ప్రైస్ కో- ఫౌండర్ సీతాకాంతా రాయ్. ఇంకా చెప్పాలంటే ఏ వస్తువును కొనాలి? ఎక్కడ కొనాలి? ఎప్పుడు కొనాలనేది అక్కడికక్కడే నిర్ణయించుకోవచ్చంటున్నారు.
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ‘మై స్మార్ట్ ప్రైస్’. ఇప్పటివరకు ఇందులో వివిధ కంపెనీల ఉత్పత్తుల ధరలు ఎంతున్నాయో తెలుసుకోవచ్చు. కానీ, ఇకపై ఆఫ్‌లైన్‌లోనూ ఆ ఉత్పత్తుల ధరలెలా ఉన్నాయో తెలుసుకునే వీలుంది. ఏదైనా వస్తువును కొనాలంటే ఆన్‌లైన్‌లో ఎంతుందో.. ఆఫ్‌లైన్‌లో ఎంతుందో ముందుగానే తెలిస్తే కొనుగోలుదారులకు డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి కదా.
ధరలకే పరిమితం కాదు..
ప్రస్తుతం మై స్మార్ట్ ప్రైస్‌లో మొబైల్స్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, కిడ్స్ అండ్ ఉమెన్ యాక్సెసరీలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా సుమారు 250కి పైగా ఉత్పత్తుల ధరలు ఉంటాయి. కేవలం ధరలే కాదు ఆ ఉత్పత్తులకు సంబంధించిన రేటింగ్స్, రివ్యూలు, కొనుగోలు చేస్తే ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? నెలసరి వాయిదా, సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) వంటివి ఉన్నాయా? స్టోర్ చరిత్ర, రాయితీలు, ఆఫర్లు, రాబోతున్న ఉత్పత్తుల గురించి వంటివి అన్ని వివరాలుంటాయి. టాప్ 30 ఈ-కామర్స్ కంపెనీలు మా కస్టమర్లే. విక్రయించిన ప్రతి వస్తువుపై 3 శాతం చార్జీ వసూలు చేస్తాం.
పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్..
ఆన్‌లైన్‌లో ధరలు తెలుసుకుని ఆఫ్‌లైన్‌లో కొంటున్న కస్టమర్లు 75%కి పైనే ఉంటున్నారు. ఈ అంతరాన్ని కూడా తగ్గించేందుకు ఆఫ్‌లైన్ స్టోర్ల ధరలు కూడా మై స్మార్ట్ ప్రైస్‌లో ఇచ్చేందుకు నిర్ణయించాం. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ప్రస్తుతం జంట నగరాల్లోని సుమారు 300లకు పైగా ఆఫ్‌లైన్ మొబైల్ స్టోర్లతో ఒప్పందం చేసుకున్నాం. సంగీత, ది మొబైల్ స్టోర్, బిగ్ సీ, ఎస్ మార్ట్, ఆర్‌ఎస్‌జీ వంటివి ఉన్నాయి. మై స్మార్ట్ ప్రైస్‌కు లాగిన్ అయిన కస్టమర్‌కు అతనుండే ప్రాంతం నుంచి 7 కి.మీ. పరిధిలో ఉన్న రిటైల్ దుకాణాల వివరాలు, అక్కడి ధరల వివరాలొస్తాయి. ప్రస్తుతం మొబైల్స్ వరకే పరిమితమయ్యాం. మరో ఆరు నెలల్లో ఇతర ఉత్పత్తులకు విస్తరిస్తాం. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్ల సేవలను బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైలకూ విస్తరిస్తాం. ఇప్పటికే ఇతర నగరాల్లోని 150కి పైగా రిటైల్ దుకాణదారులతో ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండేళ్లలో బేబీ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ ఉత్పత్తులు, కిరాణా వస్తువుల ధరల వివరాలు కూడా మై స్మార్ట్ ప్రైస్‌లో పొందుపరుస్తాం.
మొబైల్స్‌దే మొదటి స్థానం..
మై స్మార్ట్ ప్రైస్ వినియోగదారుల్లో తొలి స్థానం ఢిల్లీ, రెండో స్థానంలో చెన్నై నిలిస్తే.. హైదరాబాద్‌ది మూడో స్థానం. ప్రస్తుతం నెలకు కోటి మంది కస్టమర్లు మై స్మార్ట్ ప్రైస్‌ను వీక్షిస్తున్నారు. ఇందులో 40 శాతం వాటా మొబైల్స్ కస్టమర్లదే. అయితే ఆన్‌లైన్‌లో ధరలు, రివ్యూలు చూసి ఆఫ్‌లైన్‌లో కొనేవాళ్లే ఎక్కువ. 25-34 ఏళ్ల మధ్య వయస్సున్న కస్టమర్ల వాటా 50 శాతం ఉంటుంది. మా కస్టమర్లలో 60 శాతం మంది రిటైల్ దుకాణాల్లోనే కొంటున్నారు.
రూ.100 కోట్ల నిధుల సమీకరణ..
2010 ఆక్టోబర్‌లో ప్రారంభించిన మై స్మార్ట్ ప్రైస్‌లో తొలిసారిగా గతేడాది ఆక్సెల్ అండ్ హెలియన్ వెంచర్ క్యాప్టల్ రూ.8 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ వ్యాపారం మీద ఆధారపడి నిధుల సమీకరణ చేపడుతున్నాం. ఒక్కో నగరంపై ఎంతలేదన్నా రూ.15 కోట్లు ఖర్చు చేస్తాం. తొలివిడత రూ.100 కోట్ల నిధుల సమీక రణపై దృష్టి పెట్టాం. గతేడాది రూ.24 కోట్ల టర్నోవర్‌కు చేరాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని సాధిస్తాం.