మెసేజింగ్ సర్వీసుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్, కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఐఫోన్లపై రెండు సరికొత్త ఫీచర్లను వాట్సాప్ ఆవిష్కరించింది. దానిలో ఒకటి యూట్యూబ్ వీడియోలను సంభాషణ మధ్యలో ఉండగానే ప్రత్యక్షంగా చూసేలా, రెండోది లాక్ రికార్డింగ్. దీని ద్వారా కింద ఉన్న బటన్‌ను అలానే పట్టుకుని ఉండకుండానే యూజర్లు వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేయవచ్చు. యూట్యూబ్ ఫీచర్‌ను పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ) మోడ్‌లో యూజర్లకు అందిస్తోంది. ఈ ఫీచర్లను సద్వినియోగం చేసుకునేందుకు ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి కొత్త వాట్సాప్ వీ2.17.81 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
'' యూట్యూబ్ వీడియో తిలకించేందుకు యూజర్లు ఓ లింక్‌ను పొందితే, దాన్ని ప్రస్తుతం వాట్సాప్‌లోనే ప్లే చేసుకోవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్‌తో మరో చాట్‌ను నావిగేట్ చేస్తూనే వీడియోను తిలకించవచ్చు'' అని యాప్ స్టోర్ పేర్కొంది. ఇంతకముందు వరకు యూజర్లు వారు పొందిన లింక్‌ను క్లిక్ చేస్తే, స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ అయిన యూట్యూబ్ యాప్‌లో ఆ వీడియో ఓపెన్ అయ్యేది. తాజా అప్‌డేట్ ద్వారా లాంగ్ మెసేజ్‌లను కూడా తేలికగా రికార్డు చేసుకోవచ్చు. లాంగ్ వాయిస్ మెసేజస్‌ను తేలికగా రికార్డు చేసుకోవాలనుకుంటే, లాక్ రికార్డింగ్‌ను స్వైప్ చేసి, వాయిస్ రికార్డింగ్‌ను చేపట్టవచ్చు. అదేవిధంగా మరో ఫీచర్‌ను కూడా లాంచ్ చేసేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. వాయిస్ నుంచి వీడియో కాల్‌కు, వీడియో నుంచి వాయిస్ కాల్‌కు కాల్ మధ్యలో ఉండగానే మారేలా వాట్సాప్ పనిచేస్తుందని తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త బటన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment