శాంసంగ్, ఆపిల్ రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నువ్వానేనా అంటూ తలపడుతుంటాయి. తమ లాభాలను అసలు పక్క కంపెనీకి వదలకుండా పోటీపడుతుంటాయి. ఇటీవల ఈ రెండు కంపెనీలు తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లను విడుదల చేస్తే, ఆపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆపిల్ నుంచి వచ్చిన ఆల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్. ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టింది. మరో నెలలో ఇది విక్రయానికి వచ్చేస్తోంది. అయితే ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే ఎక్కువగా లాభపడేది శాంసంగ్ కంపెనీనేనట. అదేమిటి? ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే లాభాలు వచ్చేది ఆపిల్‌కి కదా..? శాంసంగ్‌కు ఎలా అనుకుంటున్నారా? ఐఫోన్ ఎక్స్ కు కావాల్సిన ఓలెడ్ ప్యానల్స్‌ను, ఎన్‌ఏఎన్‌డీ ఫ్లాష్, డీర్యామ్ చిప్‌లను శాంసంగ్ కంపెనీనే అందించింది. ఈ కాంపోనెంట్లను సరఫరా చేసిన ఏకైక సప్లయిర్ శాంసంగ్ కంపెనీనే. దీంతో 999 డాలర్ల విలువైన ఐఫోన్ ఎక్స్ ఒక్కో యూనిట్ విక్రయంపై 110 డాలర్లు వరకు శాంసంగ్ కంపెనీకే వెళ్లనున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. అంటే ఐఫోన్ ఎక్స్ మొత్తం మార్కెట్ ధరల్లో 10 శాతం శాంసంగ్ కంపెనీకేనట.
వచ్చే రెండేళ్లలో 130 మిలియన్ యూనిట్లను ఆపిల్ విక్రయించాలని చూస్తోంది. దీంతో గెలాక్సీ ఎస్ 8ల విక్రయం కంటే ఎక్కువ లాభాలు, ఆపిల్ ఎక్స్ నుంచే శాంసంగ్‌కు రానున్నట్టు రిపోర్టు పేర్కొంది. శాంసంగ్ కంపెనీకి 35 శాతం రెవెన్యూలు కూడా తను అందించే కాంపోనెంట్ల నుంచే వస్తున్నట్టు తెలిపింది. మొత్తం ఐఫోన్ ఎక్స్ నుంచి 14 బిలియన్ డాలర్ల వరకు లాభాలను ఆర్జించవచ్చని ఈ కొరియా కంపెనీ అంచనావేస్తోంది. ఇదే కాలంలో గెలాక్సీ ఎస్8 నుంచి 10 బిలియన్ డాలర్ల వస్తాయని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తీవ్ర పోటీదారిగా ఉన్న శాంసంగ్‌కు ఇంతమొత్తంలో రెవెన్యూలను అందించడం ఇష్టం లేని ఆపిల్, ఒకానొక సమయంలో మరో సప్లయర్ కోసం కూడా చూసిందని వార్తలు వచ్చాయి. 2019 నుంచి ఎల్‌జీని సప్లయర్‌గా ఎంపికచేసుకుంటుందని రూమర్లు ఉన్నాయి. అయితే మార్కెట్‌లో ఎంత పోటీ ఉన్నప్పటికీ, శాంసంగ్, ఆపిల్ మధ్య గత కొన్నేళ్లుగా ఉన్న స్వీట్ రీలేషన్‌షిప్ ఇదేనని టెక్ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment