వడ్డీరేట్లు ఇంతకన్నా తగ్గవా..? | Will RBI Let Banks Kick The Bad Loan Can Down The Road Again? | Sakshi
Sakshi News home page

వడ్డీరేట్లు ఇంతకన్నా తగ్గవా..?

Published Tue, Oct 18 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

వడ్డీరేట్లు ఇంతకన్నా తగ్గవా..?

వడ్డీరేట్లు ఇంతకన్నా తగ్గవా..?

రెండున్నర ఏళ్లలో ఆర్‌బీఐ తగ్గించింది 1.75 శాతం
బ్యాంకులు తగ్గించింది కేవలం 0.8 శాతం లోపే
డిపాజిట్ రేట్లు తగ్గింపు 1.50 శాతం
ఇంతకంటే తగ్గే అవకాశం తక్కువే అంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: వడ్డీరేట్ల తగ్గింపునకు ఇక బ్రేక్ పడనుందా? ఇంతకంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు సన్నగిల్లుతున్నాయా? ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇంతకంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ తగ్గించిన వడ్డీరేట్లలో రుణ గ్రహీతలకు ఎంత మేరకు ప్రయోజనం లభించింది, డిపాజిట్ల రేట్లు ఇంకా తగ్గే అవకాశాలున్నాయా అన్న అంశాలను పరిశీలిస్తే...

 ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తున్నా ఆ మేరకు రుణాలకు చెల్లించే ఈఎంఐ భారం తగ్గడం లేదు. కానీ ఇదే సమయంలో డిపాజిట్ల రేట్లు మాత్రం భారీగా తగ్గిపోతున్నాయి. దీంతో రుణ భారం తగ్గకపోగా దాచుకుందామంటే సరైన వడ్డీ రాక రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది సామాన్యుని పరిస్థితి. గడిచిన రెండున్నర ఏళ్లలో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 1.75 శాతం వరకు తగ్గించింది. దీంతో వడ్డీరేట్లు తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుందనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆర్‌బీఐ తగ్గించిన స్థాయిలో బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లును తగ్గించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 0.65 శాతం నుంచి 0.80 శాతమే బ్యాంకులు బేస్ రేటును తగ్గించాయి.

అంటే ఆర్‌బీఐ తగ్గించిన దాంట్లో కనీసం 50 శాతం కూడా బ్యాంకులు అందించలేదన్నమాట. కానీ ఇదే సమయంలో డిపాజిట్ల రేట్లను మాత్రం బ్యాంకులు తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు చాలా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను ఏడు శాతం మించి ఇవ్వడం లేదు. 2015లో మూడు నుంచి 10 ఏళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ 8.5 శాతం వడ్డీరేటు ఇచ్చేది. కానీ ఇప్పుడు 7 శాతం మించి ఇవ్వడం లేదు. అంటే ఈ ఏడాదిన్నరలో డిపాజిట్లపై వడ్డీరేట్లు 1.50 శాతం తగ్గాయి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 1.8 శాతం వరకు డిపాజిట్ రేట్లను తగ్గించింది.

 ఎంసీఎల్‌ఆర్‌తో ఆలస్యం..
ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించినా ఖాతాదారులకు ఆ ప్రయోజనం తక్షణం ఇవ్వలేమని బ్యాంకులు పేర్కొంటున్నాయి. కొత్త డిపాజిట్లపై రేట్లు తగ్గినా గతంలో అధిక వడ్డీరేట్లకు ఇచ్చిన డిపాజిట్ల వల్ల ఆర్‌బీఐ తగ్గింపు ప్రయోజనం వెంటనే అందించలేమంటున్నాయి.  కొత్తగా ప్రవేశపెట్టిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) విధానంలో ఈ ప్రయోజనం పూర్తిస్థాయిలో బదలాయించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందన్నది బ్యాంకుల వాదన. ఆర్‌బీఐ తగ్గించిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని ఖాతాదారులకు పూర్తిగా అందించకుండా ఎన్‌పీఏలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయన్నది విశ్లేషకుల వాదన.

పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు ఏడాది కాలంలో 5.3 శాతం నుంచి 10.4 శాతానికి చేరడం, కేంద్రం తగినంత మూలధన నిధులు ఇవ్వకపోతుండటంతో ఆర్‌బీఐ తగ్గింపు ప్రయోజనాన్ని ఎన్‌పీఏలు తగ్గించుకోవడానికి వినియోగించుకుంటున్నాయని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. అధిక వడ్డీ మార్జిన్‌తో పాటు, వడ్డీరేట్లు తగ్గడం వల్ల బాండ్స్ ఈల్డ్స్ పెరగడం ద్వారా క్యాపిటల్ గెయిన్ లాభాలను బ్యాంకులు పొందుతున్నాయన్నారు.

 ఇక తగ్గడం కష్టమే..
ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లు మరింతగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం ఇంతకంటే దిగువకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు కె.నరసింహమూర్తి తెలిపారు. వచ్చే 12 నెలల కాలంలో మహా అయితే పావు శాతం మించి తగ్గే అవకాశం లేదని సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు.

కేవలం డిపాజిట్లనే ప్రధాన ఆదాయవనరుగా ఎంచుకునే పెన్షనర్స్ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్ పేర్కొంటున్నారు. కానీ రానున్న కాలంలో డిపాజిట్ల రేట్లు మరింత తగ్గకపోయినా రుణాలపై ఈఎంఐ భారం మరింకొంత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఆర్‌బీఐ తగ్గించిన మొత్తం ప్రయోజనాన్ని అందించలేకపోయినా ఇంకో 0.25 శాతం నుంచి 0.5 శాతం వరకు బ్యాంకులు క్రమేపీ తగ్గించే అవకాశాలున్నాయని సతీష్ అంచనా వేస్తున్నారు. యుద్ధ వాతావరణం వంటి అనుకోని సంఘటనలు వస్తే తప్ప వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేదని, మరికొంత కాలం దిగువస్థాయిలోనే వడ్డీరేట్లు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement