ఫలితాల సందర్భంగా విప్రో సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా(ఎడమ నుంచి మూడు), కంపెనీ ఇతర ప్రతినిధులు
బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,121 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.2,077 కోట్లతో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించినట్లు విప్రో తెలిపింది. మొత్తం లాభం రూ.2,083 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.2,094 కోట్లకు చేరుకుంది.
ఆదాయం రూ.13,626 కోట్ల నుంచి 3 శాతం పెరిగి రూ.13,978 కోట్లకు ఎగసింది. ఈ జూన్ క్వార్టర్లో ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 5% వృద్ధితో రూ.13,700 కోట్లకు పెరిగిందని, డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం వృద్ధితో 203 కోట్ల డాలర్లకు చేరుకుందని విప్రో సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా చెప్పారు. ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్‌లో 0.3– 2% రేంజ్‌లో వృద్ధి చెంది 200–205 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
అంచనాలు మించిన ఫలితాలు..
విప్రో జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఐటీ సేవల నిర్వహణ లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 24 శాతం వృద్ధితో రూ.2,397 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ 3.1 శాతం వృద్ధితో 17.5 శాతానికి చేరింది. నిర్వహణ లాభం రూ.2,169 కోట్లుగా, మార్జిన్ 16 శాతంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాలను విప్రో అధిగమించింది.
సరైన దారిలోనే విప్రో...
అభివృద్ధి చెందిన మార్కెట్లలో ముఖ్యంగా ఉత్తర అమెరికా దేశాల్లో ఐటీపై కంపెనీలు చేస్తున్న వ్యయాలు పెరిగినట్లు నీముచ్‌వాలా చెప్పారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో కూడా ఐటీ వ్యయాలు పెరిగాయని వివరించారు. డిజిటల్ విభాగంలో తాము పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డర్ల పరంగా ఈ క్వార్టర్ బాగా ఉందని, విప్రో సరైన దిశలోనే పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక మార్చి క్వార్టర్‌లో 1,63,827గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్ క్వార్టర్ నాటికి 1,64,659కు పెరిగిందని పేర్కొన్నారు.
మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో విప్రో షేర్ 0.7 శాతం నష్టంతో రూ.283 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్ 9 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ఇతర ఐటీ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. టీసీఎస్ 47 శాతం, ఇన్ఫోసిస్ 27 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 11 శాతం చొప్పున లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment