న్యూఢిల్లీ: చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం షావోమి... తాజాగా భారత్‌లో డిజిటల్ రుణాల మంజూరీ కార్యకలాపాల్లోకి కూడా ప్రవేశించింది. తమ యూజర్లకు ఇన్‌స్టంట్ రుణాలందించే దిశగా ‘ఎంఐ (మి) క్రెడిట్’ పేరుతో సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌కి రుణ సదుపాయం అందించే క్రెడిట్‌బీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యువ ప్రొఫెషనల్స్‌కి స్వల్పకాలిక రుణాల మంజూరుకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడనుంది.
చాలా సరళతరమైన కేవైసీ (ఖాతాదారు సమగ్ర వివరాల) వెరిఫికేషన్ ద్వారా పది నిమిషాల వ్యవధిలోనే రుణ ప్రాసెసింగ్ జరుగుతుందని షావోమి తెలిపింది. ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫాం ద్వారా షావోమి యూజర్లకు క్రెడిట్‌బీ రూ.1,000 నుంచి రూ.1,00,000 దాకా రుణాలు ఆఫర్ చేస్తోంది. ఇతరత్రా క్రెడిట్ కార్డు సంస్థల తరహాలోనే నెలకు మూడు శాతం (వార్షికంగా 36%) వడ్డీ రేటు ఉంటుంది. కేవలం ఎంఐ యూజర్స్‌కే తప్ప ఇతర ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు.
తమ ఫోన్ల విక్రయానికి ఈ ఆఫర్ మరింతగా తోడ్పడగలదని షావోమి భావిస్తోంది. ఐడీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 31.1% మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ విభాగంలో భారత్‌లో షావోమి అగ్రస్థానంలో, 25% వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్ స్క్రీన్స్‌పైనే యూజర్స్‌కి లోన్ ఆఫర్లు కనిపిస్తాయి. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే కంపెనీ సైట్ తెరుచుకుంటుంది.
అవసరమైన వివరాలన్నీ పొందుపరిచాక రుణ ప్రక్రియ మొదలవుతుంది. అయితే, ప్రాసెసింగ్ చార్జీల వంటివి ఒకసారి చూసుకోవడం మంచిదనేది మార్కెట్ వర్గాల మాట. ప్రస్తుతం క్రెడిట్‌బీ రుణ మొత్తాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1,000 దాకా చార్జీలు వసూలు చేస్తోంది. దీన్ని అసలు నుంచి మినహాయించుకున్నాకే మిగతాది విడుదల చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment