
న్యూఢిల్లీ : ఆధార్... దేశంలో పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆధార్‌ను అన్ని సేవలకు అనుసంధానం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత వివరాలన్నీ బట్టబయలు అవుతాయని కొందరు వాదిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల భద్రత పెరుగుతుందని చెబుతోంది. అసలు ఆధార్ వల్ల ముప్పెంత..? ప్రయోజనమెంత..? అనే విషయాలపై ఇజ్రాయిల్ చరిత్రకారుడు యువాల్ నోహ్ హరారి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ టెక్నాలజీ కూడా నిర్ణాయకమైనది కాదని హరారి అన్నారు. ప్రతి టెక్నాలజీలోనూ సానుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయని చెప్పారు. కానీ బయోటెక్నాలజీ విషయంలో కొంత మొత్తంలో ఉండే ప్రతికూలతల కోసం, భారీ మొత్తంలో ప్రయోజనాలను వదులుకోవడం మూర్ఖత్వమేనన్నారు.
ఉదాహరణకు..నాజి జర్మనీ రేడియోను ప్రధాన ప్రచార సాధనంగా వాడుకున్నారు. ప్రతి సాయంత్రం, ప్రతి రోజూ హిట్లర్ తన ప్రసంగాలను లక్షల కొద్దీ జర్మన్లకు రేడియో ద్వారానే వినిపించే వారు. వారి బ్రెయిన్‌వాష్ చేశారు. అంటే రేడియో చెడుకే అనే అర్థమా? అన్ని రేడియో సెట్లను నాశనం చేశామా? కాదు కదా! చాలా మంచి విషయాలకు కూడా రేడియోను వాడారు. ఇదే బయోటెక్నాలజీ విషయంలోనూ అప్లయ్ అవుతుంది. బయోటెక్నాలజీ విషయంలో ప్రజలు భయపడాల్సినవసరం లేదు.
దీన్ని ఆపాలని చూసినా.. నాశనం చేయాలని చూసినా.. ఎలాంటి ఉపయోగకరం ఉండదని హెచ్చరించారు. ప్రతి టెక్నాలజీ విషయంలోనూ పలు రాజకీయ కోణాలుంటాయని, అన్ని అవకాశాలను తెలుసుకున్న అనంతరమే సరియైన దాన్ని ఎంపిక చేసుకోవాలని హరారి సూచించారు. ముంబైలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇండియా టుడే కంక్లేవ్ 2018 సందర్భంగా హరారి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్తమానానికి, భవిష్యత్తు చాలా భిన్నంగా ఉంటుందని, అదేవిధంగా గ్లోబల్ సమస్యలను, గ్లోబల్ పరిష్కారాలు కనుగొనాల్సినవసరం కూడా తమపైనే ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment