కోరిన అడ్రస్‌కు చేర్చే యాప్.. | zipper app usefull for finding any address | Sakshi
Sakshi News home page

కోరిన అడ్రస్‌కు చేర్చే యాప్..

Published Tue, Jul 22 2014 12:25 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

కోరిన అడ్రస్‌కు చేర్చే యాప్.. - Sakshi

కోరిన అడ్రస్‌కు చేర్చే యాప్..

జిప్పర్ యాప్‌తో చిరునామా వెతకడం ఈజీ  
హైదరాబాదీ స్టార్టప్ ఘనత


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటికి తొలిసారిగా వచ్చే స్నేహితులకు వారికి అర్థమయ్యేలా చిరునామా చెప్పడంలో పడే కష్టం అంతా ఇంతా కాదు. మీరు ఎంత వివరించినా చిరునామా కోసం వారి నుంచి పదే పదే ఫోన్ కాల్స్ రావడం సహజం. అదే మీరు పంపే ఒక్క కోడ్‌తో స్నేహితులు నేరుగా ఇంటికి రాగలిగితే.. మీలాంటి వారి కోసమే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ జిప్పర్ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఉదాహరణకు సాక్షి ప్రధాన కార్యాలయానికి రావాలంటే జిప్పర్‌లోకి వెళ్లి ‘క్యూయూకేజెడ్3285’ అనే కోడ్ ఇస్తే చాలు. గూగుల్ మ్యాప్‌తో కూడిన చిరునామా మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్/ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. మీరున్న చోటు నుంచి ఎలా వెళ్లాలోదారి చూపుతుంది కూడా.
 
ఎలా పనిచేస్తుందంటే..
స్మార్ట్‌ఫోన్‌లో జిప్పర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. క్రియేట్ ఏ జిప్పర్ అన్న చోట క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద ఉన్న మ్యాప్‌పై మీరుండే ప్రాంతం పేరు దగ్గర క్లిక్ చేయాలి. యాడ్ లొకేషన్ పేరుతో ఒక బాక్స్ తెరుచుకుంటుంది. పూర్తి చిరునామా వివరాలు ఇచ్చి సేవ్ చేయాలి. జెడ్‌ఐపీ.పీఆర్ అనే వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇచ్చే వివరాల ఆధారంగా ఒక కోడ్ రూపొందుతుంది. జిప్పర్ యాప్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ కోడ్‌ను టైప్ చేయగానే అడ్రస్ స్క్రీన్‌పైన కనిపిస్తుంది. రూట్ మ్యాప్‌పైన క్లిక్ చేస్తే దారి కూడా చూపిస్తుంది. మీ స్నేహితులు, బంధువులు, డెలివరీ బాయ్, క్యాబ్ డ్రైవర్ ఇలా ఎవరికైనా ఈ కోడ్‌ను షేర్ చేయొచ్చు.
 
అనుభవమే యాప్‌కు..
డిజిటల్ మీడియా యాడ్ ఏజెన్సీ మీడియా మింట్‌ను స్థాపించిన వి.ఆదిత్య జిప్పర్ యాప్‌కు రూపకర్త. కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆదిత్య తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. క్లినిక్ చిరునామా చెప్పేందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతాకాదు. అమెరికాలో ఇల్లు, కార్యాలయాల చిరునామా కనుక్కోవడం చాలా సులువు.
 
ఆ స్థాయిలో చిరునామాను సూచించే బోర్డులుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిరునామా సమస్యలకు పరిష్కారం ఇవ్వాలన్న ఆలోచన ప్రతిరూపమే జిప్పర్ అని అంటున్నారు ఆదిత్య. 2013 డిసెంబరులో యాప్ విడుదలైంది. ఇప్పటి వరకు 17 దేశాలకు చెందిన 25 వేల మందికిపైగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. హలో కర్రీ, డిజిటల్ క్యాంపస్, ఫుడ్ మింగో, మీడియా మింట్ వంటి 15 కంపెనీలు ఈ యాప్ ద్వారా కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. 108 అంబులెన్సుల్లోనూ ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.
 
నిధుల సమీకరణలో..
మొబైల్, టెలికం ద్వారా కోట్లాది ప్రజలపై ప్రభావం చూపే కంపెనీలకు ఇచ్చే ఎం బిల్లియన్త్ అవార్డ్ సౌత్ ఆసియా రన్నరప్‌గా జిప్పర్ నిలిచింది. కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉందనడానికి ఈ అవార్డు నిదర్శనమని ఆదిత్య తెలిపారు. ప్రతి ఇంటికి, కార్యాలయానికి, వ్యాపార సంస్థలకు డిజిటల్ చిరునామా గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ల క్ష్యమని చెప్పారు. వ్యక్తులెవరైనా యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
 
కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేస్తామన్నారు. తొలి 50 కంపెనీలకు ఉచితమని వివరించారు. ఇప్పటి వరకు రూ.1 కోటి వ్యయం చేశామన్నారు. రూ.10 కోట్ల దాకా సీడ్ ఫండ్ సమకూర్చేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని స్వీకరిస్తామన్నారు. ఆదిత్య టీమ్‌లో 10 మంది యువకులున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement