సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ జియోమీట్‌పై వాడివేడి చర్చ సాగుతోంది. జియోమీట్‌పై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు జూమ్ సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. జూమ్ యాప్‌ను పోలినవిధంగా జియోమీట్ యాప్ ఉండటంతో తాను కంగుతిన్నానని జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే విస్మయం వ్యక్తం చేశారు. జియోమీట్‌పై కేసు వేయడంపై రాజే నేరుగా స్పందించకపోయినా దీనిపై తమ న్యాయ విభాగం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జియోమీట్ యాప్ వస్తుందని తమకు ముందుగా తెలుసునని..దీన్ని తాము స్వాగతించామని, పోటీని ఎదుర్కోవడం జూమ్‌కు కొత్త కాదని అన్నారు. తమ ఉత్పత్తులు, సాంకేతికతే తమ బలమని..కస్టమర్లకు మెరుగైన సేవలందించడంపైనే తాము దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రత్యర్ధులు వారి వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటారని రాజే పేర్కొన్నారు. జూమ్ బృందం ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. జూమ్ డేటా సెంటర్ల గురించి సాంకేతిక సమాచారంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
తాము ఎవరితోనూ డేటాను పంచుకోవడం లేదని, తమ ప్లాట్‌ఫాంపై సాంకేతిక అంశాలను, ఎలా ఆపరేట్ చేయాలనే వివరాలను పంచుకుంటామని పేర్కొన్నారు. గల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన నేపథ్యంలో భారత్ గతవారం 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. చైనా యాప్‌లను నిషేధించిన అనంతరం పెద్ద ఎత్తున స్వదేశీ యాప్‌లను భారతీయులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. జియోమీట్‌ను లాంఛ్ చేసిన వారం రోజుల్లోనే 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరోవైపు చైనా వ్యతిరేక సెంటిమెంట్ నెలకొన్న క్రమంలో జూమ్ చైనా యాప్ అనే ప్రచారం సాగుతుండటంపై కంపెనీ వివరణ ఇచ్చింది. తమది చైనా కంపెనీ కాదని, అమెరికన్ కంపెనీ అని నాస్డాక్‌లో ట్రేడవుతోందని జూమ్ పేర్కొంది. కాలిఫోర్నియాలోని శాంజోస్‌లో కంపెనీ ప్రధాన కార్యాలయం పనిచేస్తోందని జూమ్ ట్వీట్ చేసింది. భారత్‌లో తమకు రెండు డేటా సెంటర్లు ఉన్నాయని, తాము డేటాను ఏ ప్రభుత్వంతోనూ పంచుకోవడం లేదని జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే సైతం వివరణ ఇచ్చారు. చదవండి : జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్‌లోడ్స్
Comments
Please login to add a commentAdd a comment