అశ్వారావుపేటరూరల్ : పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తెతో సహా 22 మందికి గాయాలు కాగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామానికి చెందిన మడకం లక్మా(పెళ్లి కుమార్తె)కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం రాచన్నగూడేనికి చెందిన వరుడితో పెళ్లి నిశ్చయం కాగా, సోమవారం రాత్రి వరుడి ఇంట్లో జరిగే వివాహం కోసం పెళ్లి కుమార్తెను తీసుకొని రెండు ట్రాక్టర్లలో బయల్దేరారు.
అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం రోడ్డులోగల ఓ మూలమలుపు వద్ద ఒక ట్రాక్టర్ ట్రక్కు చింతకాయ జారిపోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ ట్రాక్టర్‌లో ఉన్న పెళ్లి కుమార్తెతోపాటు కోవ్వాసి బీబమ్మ, వెట్టి మంగమ్మ, సోడెం భద్రం, మడకం ముత్తమ్మ, మడకం లక్ష్మీలకు తీవ్ర గాయాలు కాగా వీరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదే ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న మడివి పండు, మడకం మాడ, ఎం.ఊంగీ, ఎం.లక్ష్మి, ముచ్చిక దేవ, మడకం లక్ష్మీతోపాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి విషమంగా ఉన్న వారిని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన వారిని మరో ట్రాక్టర్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణంతా క్షతగాత్రుల రోదనలతో హోరెత్తింది.
దీనిపై స్థానిక పోలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా..ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment