మృతురాలు సిరి, 10వ వార్డులో డూ అండ్ డై బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న భవనం
బ్యూటీ పార్లర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన సిరి(19) కేసు.. మనీ మాటున ఆవిరవుతోంది. కేసును నీరుగార్చేందుకు అధికార పక్షం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపిన హైడ్రామాలో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి రాజకీయ బ్రోకర్లు రూ.25లక్షలు పంచుకున్నట్లు తెలుస్తోంది.
సిరితో సిరి కేసు ఆవిరైపోయింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పాటు లక్షలు చేతులు మారడంతో సాక్ష్యాలను భూస్థాపితం చేసి హత్య కేసును నీరుగార్చారు. పార్లర్ నిర్వాహకురాలి తండ్రి గతంలో ఓ యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడైనా కనీసం ఆయనపై ఈగ వాలకుండా మధ్యవర్తులు వ్యవహారాన్ని నోట్ల కట్టలతో మేనేజ్ చేశారు. యువతి మృతి సంగతలా ఉంచితే అసలు అక్కడ జరుగుతున్న వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
రేపల్లె: పట్టణంలోని డూ అండ్ డై బ్యూటీ పార్లర్‌లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతి సిరి కేసును నీరుగార్చేందుకు అధికార పక్షమైన టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడించిన హైడ్రామాలో దాదాపు 25 లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి, మిగతా సొమ్ము రాజకీయ బ్రోకర్లు పంచుకున్నారని తెలుస్తోంది.
పట్టణంలోని 10వ వార్డులో ఉన్న డూ అండ్ డై బ్యూటీ పార్లర్‌లో యాదాద్రి జిల్లా వరిగొండ మండలం రెడ్లపాలెం గ్రామానికి చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యువతి మరణిస్తే రాత్రి 8గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిరి తల్లితండ్రులు ఊర్మిళ, యాదయ్యలతో పాటు బంధువులు సిరి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మృతి చెందిన అనంతరం క్షణాల్లో సంఘటనా స్థలానికి రాజకీయ నాయకుల రంగప్రవేశం, మృతురాలి తల్లిదండ్రులతో బేరాలు మాట్లాడి రూ.2.50 లక్షలు వెల కట్టడం, బేరం కుదరగానే గురువారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడం శరవేగంగా జరిగిపోయాయి.
రాజకీయ ఒత్తిడులతో కీలక అంశాలకు పాతర
సిరి మృతి కేసులో రాజకీయ ఒత్తిడులతో పోలీసులు కీలక అంశాలకు పాతర వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి చేయడంతో కేసును నీరుగార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న గదిలో కాకుండా శవం వేరే గదిలో ఉండడం, ఉరి వేసుకున్నట్టు చెబుతున్న గదిలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించినా పట్టించుకోలేదు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు గ్రహించినా క్లూస్ టీమ్‌ను ఎందుకు రప్పించలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సిరి తల్లిదండ్రులు ఊర్మిళ, యాదయ్య తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని నిర్వాహకులే చంపి వుంటారని చెప్పినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బ్యూటీ పార్లర్‌లో సిరితో పాటు పనిచేస్తున్న దీనా అనే యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
పార్లర్ నిర్వాహకురాలి తండ్రి గతంలో హత్య కేసులో నిందితుడు
బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు తోట సింధు హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఆమె తండ్రి పార్లర్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ఆయన 2003లో పట్టణంలో జరిగిన భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. కలప వ్యాపారం చేసే ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కలప తెప్పిస్తూ కోట్లలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కలప వ్యాపారులు వచ్చిన సమయంలో ఈ బ్యూటీ పార్లర్‌లో విడిది చేస్తుంటారని స్థాని కుల ఆరోపణ. బ్యూటీ పార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment