కాల్‌సెంటర్‌ ‘కాల్‌’కేయులు! | 30 held for cheating SBI credit card holders of Rs 5 crore | Sakshi
Sakshi News home page

కాల్‌సెంటర్‌ ‘కాల్‌’కేయులు!

Published Thu, Jul 12 2018 3:53 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

30 held for cheating SBI credit card holders of Rs 5 crore - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: ‘అచ్చం బ్యాంక్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినట్లుగానే ఉంటుంది. అవతలి నుంచి మాట్లాడిన టెలికాలర్‌ క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చేస్తామంటూ చెప్పి.. ఖాతాదారుల నుంచి కార్డు వివరాలు, సీవీవీ తీసుకుంటారు. ఇలా వివరాలు చెబుతుండగానే జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ బ్యాంక్‌ ఖాతాకు రూ. 8,500లు షాపింగ్‌ పేరిట బదిలీ అయ్యాయని ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇలా 2 వేల మంది నుంచి రూ.5 కోట్లు కాజేశారు.

హైదరాబాద్‌ కేంద్రంగా ఈ మోసాలు సాగుతుండటంతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.80 లక్షల నగదుతో పాటు 2 ల్యాప్‌టాప్‌లు, 15 సెల్‌ఫోన్లు, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల డేటా, కారు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 8 మందిని కీలక నిందితులుగా నిర్ధారించారు. కేసు వివరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం మీడియాకు వివరించారు.  

జీన్స్‌ వ్యాపారం నుంచి మోసాలవైపు...
న్యూఢిల్లీకి చెందిన విజయ్‌కుమార్‌ శర్మ వీవోపీ పేరుతో జీన్స్‌ తయారీ వ్యాపారం నిర్వహిస్తూ తరచూ హైదరాబాద్‌ వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటలో జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న సందీప్‌ బజాజ్‌తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. తను ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయానంటూ విజయ్‌కు సందీప్‌ వివరించాడు. తాను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల పేరుతో మోసపూరిత వ్యాపారం చేసి లక్షలు సంపాదించానని విజయ్‌ చెప్పడంతో సందీప్‌ కూడా ఆ వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాడు.  

ఒక్కరిని మోసగిస్తే రూ.800లు ఇన్సెంటివ్‌...
సందీప్‌ పేరు మీద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేశ్రీ.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీన్స్‌లైక్‌.కామ్‌లను విజయ్‌ రిజిస్టర్‌ చేశాడు. అలాగే లావాదేవీల కోసం సందీప్‌ 3 ఖాతాలను ఈ వెబ్‌సైట్లతో అనుసంధానం చేశాడు. అప్పటికే బ్యాంక్‌ ఖాతాదారులను మోసం చేసిన కేసులో గతేడాది ఢిల్లీ పోలీసులకు చిక్కిన విజయ్‌ కొత్త వ్యాపారం గురించి ఢిల్లీలోనే కాల్‌సెంటర్లలో పనిచేసిన అభిజిత్‌ శ్రీవాత్సవ్, అతని భార్య సీతాకుమారి, సోదరుడు అశుతోష్‌ శ్రీవాత్సవ్‌కు వివరించాడు.

ఈ ముగ్గురు వేర్వేరుగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి కాల్‌సెంటర్లను 21 మందితో నిర్వహిస్తూ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు పాత డేటాబేస్‌ నుంచి ఖాతాదారుల వివరాలు తెలుసుకొని కాల్‌ చేయడం మొదలుపెట్టారు. కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ, ఓటీపీ నంబర్లు తెలుసుకొని మోసపూరిత లావాదేవీలను జేశ్రీ.కామ్‌ ఖాతాకు మళ్లించేవారు. ఇలా ఒక్కరి వద్ద నుంచి వివరాలు సేకరించిన టెలికాలర్‌కు రూ.800ల చొప్పున ఇన్సెంటివ్‌ ఇచ్చేవారు. సందీప్‌ బ్యాంక్‌ ఖాతాకు వచ్చిన డబ్బుల్లో తను 15 శాతం ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని విజయ్, శ్రీవాత్సవ్‌ కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసేవాడు. ఇలా దాదాపు రూ.5 కోట్ల మేర మోసం చేశారు.

అసిస్టెంట్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో రంగంలోకి...
నగదు మాయంపై వందలాది కస్టమర్ల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ మృదుల కొడూరి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు జూన్‌ 25న ఫిర్యాదు చేశారు. క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా ఆదేశం మేరకు ఏసీపీ వై.శ్రీనివాస్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి టెక్నికల్‌ డేటా సహకారంతో సందీప్‌ను కొంపల్లిలో అరెస్టు చేసింది. ఇతడిచ్చిన వివరాలతో ఢిల్లీలో విజయ్, అభిజిత్, సీత, అశుతోష్, ధరమ్‌రాజ్, రెహన్‌ ఖాన్, విపిన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరితో పాటు 22 మంది టెలికాలర్లను కూడా పట్టుకున్నారు.

వీరందరినీ ఢిల్లీలోని టీస్‌ హజారిలో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కీలక నిందితులైన ఏడుగురిని ట్రాన్సిట్‌ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు కోర్టు అనుమతినిచ్చింది. మిగిలిన 22 టెలికాలర్లను ఈ నెల 23న సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చిన ఏడుగురితో పాటు నగరానికి చెందిన సందీప్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ వేస్తామని సజ్జనార్‌ తెలిపారు.


                స్వాధీనం చేసుకున్న సొమ్మును మీడియాకు చూపిస్తున్న సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement