
సాక్షి, నలంద : బిహార్‌లోని నలంద జిల్లా జబల్పూర్‌లోని ఓ బాణాసంచా దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 25 మందికి గాయాలయ్యాయి. ఫ్యాక్టరీకి సమీపంలోని పలు గృహాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ఘటనా స్ధలం నుంచి దాదాపు కిలోమీటర్ వరకూ పొగలు వ్యాపించాయి. పోలీసు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో గాయపడిన వారిని నలంద డీఎం, ఎస్పీలు ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. పేలుడుపై విచారణ కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడి ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఘటనా స్ధలాన్ని సందర్శించింది.