
ఆంజనేయులు మృతదేహం, గాయపడిన హనుమంతరావు
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): తెలుగుదేశం పార్టీ నేతల దాష్టీకానికి ఓ నిండు ప్రాణం బలైంది. మృతుడి సోదరుడు సాకి హనుమంతరావు, పోలీసుల కథనం మేరకు..గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి పమిడిపాడు గ్రామానికి చెందిన సాకి ఆంజనేయులు(28) కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 5వ తేదీన మంచినీరు పట్టుకునేందుకు పంచాయతీకి చెందిన నీటి ట్యాంకర్ వద్దకు వెళ్లాడు. అయితే కేవలం టీడీపీకి చెందినవారు మాత్రమే నీరు పట్టుకోవాలని.. మిగతావారు అక్కడినుంచి వెళ్లిపోవాలని అధికారపార్టీ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో గ్రామంలోని ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్‌ను తీసుకుని ఆంజనేయులు గ్రామానికి వచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన ట్యాంకర్ ఎందుకు తీసుకొచ్చావంటూ అతడిపై టీడీపీ నేతలు రాతం ఏడుకొండలు, రాతం వెంకటేశ్వర్లు, రాతం శ్రీనివాస్, రాతం బుజ్జాయి, రాతం పెదశ్రీను, రాతం చినవెంకటేశ్వర్లు, రాతం నర్సమ్మతో పాటు మరికొంత మంది ఘర్షణకు దిగారు.
ఈ వివాదంపై గ్రామంలోని ఇరువర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై 7వ తేదీన పోలీసుస్టేషన్‌కు వెళుతున్న ఆంజనేయులు, అతని సోదరుడు హనుమంతరావును గ్రామ పెద్దలు బ్రహ్మయ్య, చినయోహన్, కుర్రా పెదసాంబయ్య, గంటా వెంకటేశ్వర్లు వివాదం పరిష్కరించుకుందామని చెప్పి తిరిగి గ్రామానికి పిలిపించారు. అప్పటికే కర్రలు, రాడ్లు, కత్తులతో కాచుకుని కూర్చున్న టీడీపీ నేతలు ఆంజనేయులు, హనుమంతరావుతో పాటు వారి బంధువులపై కళ్లల్లో కారం కొట్టి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆంజనేయులు తీవ్రంగా గాయపడగా.. హనుమంతరావు మిగిలిన కుటుంబ సభ్యులు సైతం గాయపడటంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు అత్యవసర చికిత్స పొందిన ఆంజనేయులు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు తమకు గ్రామంలో రక్షణ కల్పించాలని..టీడీపీ నేతల అరాచకాల నుంచి కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment