రూ.11 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణను మీడియాకు చూపుతున్న ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌రావు
అడ్డతీగల (రంపచోడవరం): అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడి చేసి రూ.11 వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణను అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు కథనం ప్రకారం.. కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి.నాగేశ్వరరావు ఇక్కడ జీపు లేకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం ఐసీడీఎస్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. జీతభత్యాలన్నీ అడ్డతీగల కార్యాలయం నుంచే పొందుతున్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో తన జీపీఎఫ్ ఖాతాలో నిల్వ ఉన్న రూ.1.29 లక్షలు, సరెండర్ లీవు ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.56,940 పొందడానికి జూనియర్ అసిస్టెంట్‌ని ఖజానా శాఖకు బిల్లు పెట్టమని కోరాడు.
తనతో పాటు ఖజానా శాఖలో సిబ్బందికి కలిపి రూ.15 వేలు లంచం ఇస్తే బిల్లు పెడతానని డ్రైవర్ నాగేశ్వరరావును జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాను ఉన్న పరిస్థితుల్లో అంత సొమ్ము ఇచ్చుకోలేనని రూ.11 వేల నగదు అయితే ఇస్తానని చెప్పాడు. బిల్లు మంజూరు అయ్యాక ఇవ్వమని చెప్పడంతో ఆ సొమ్ము డ్రైవర్ నాగేశ్వర్రావు ఖాతాలో పడగా లంచం సొమ్ము కోసం జూనియర్ అసిస్టెంట్ నుంచి వేధింపులు ఎక్కువకావడంతో బాధితుడు నాగేశ్వరరావు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని గురువారం జూనియర్ అసిస్టెంట్ బద్దపు సత్యనారాయణకి డ్రైవర్ నాగేశ్వరరావు లంచం సొమ్ము రూ.11 వేలు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్నామని డీఎస్పీ సుధాకర్‌రావు తెలిపారు. రూ.11 వేలు నగదు స్వాధీనపర్చుకుని బద్దపు సత్యనారాయణ వద్ద వాంగ్మూలం నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఖజానాశాఖలోని సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో సీఐలు పుల్లారావు, మోహనరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment