జగిత్యాల క్రైం/కొండగట్టు/కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో గత నెల 21న నలుగురు కుటుంబసభ్యులను హత్యచేసిన కేసులో నిందితుడైన లక్ష్మీరాజం (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం దిగువ కొండగట్టు ప్రాంతంలో ఆదివారం చెట్టుకు ఉరివేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన చిలుమలు లక్ష్మీరాజంకు 2007లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన విమలతో వివాహమైంది. వీరికి కూతురు పవిత్ర, కుమారుడు జైపాల్ సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో విడిగా ఉంటున్న భార్య విమల నవంబర్ 21న ఖమ్మంపల్లి వచ్చిందని తెలుసుకున్న లక్ష్మీరాజం, అదే రోజు అర్ధరాత్రి విమలతోపాటు బావమరిది జాన్‌రాజ్, ఆయన భార్య రాజేశ్వరి, కుమార్తె పవిత్ర, వదిన సుజాత ఒకే గదిలో నిద్రిస్తుండగా.. వారిపై టిన్నర్ అనే రసాయనం పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. నలుగురు మృతిచెందారు. అప్పటి నుంచి పోలీసులు లక్ష్మీరాజం కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతను కొండగట్టు వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై ఉపేంద్రాచారి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment