
కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
సూర్యాపేట, కేతేపల్లి(నకిరేకల్) : మండలంలోని కొత్తపేట గ్రామంలో ఈనెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య కేసులో భాగస్వాములైన పది మంది నిందితులను బుధవారం కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పొడేటి సింహాద్రి నకిరేకల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తన క్లాస్‌మేట్ అయిన ఓ అమ్మాయి జన్మదినం సందర్భంగా సింహాద్రి అమె ఫొటోతో కూడిన మెసేజ్‌ను శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేశాడు. వాట్సాప్ చూసిన కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ కుమారుడు సయ్యద్ ‘మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డార్లింగ్’ అని అమ్మాయి బర్త్‌డే ఫొటోపై కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సింహాద్రి తన స్నేహితుడైన కందికంట రజనీకాంత్, గ్రామ నాయకులు కత్తుల వీరయ్యలకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. వారిచ్చిన పోద్బలం, సహకారంతో సయ్యద్‌పై కక్ష పెంచుకున్న సింహాద్రి సయ్యద్‌ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
ఈవిషయమై కందికంటి రజనీకాంత్, కత్తుల వీరయ్యలతో కలసి సింహాద్రి పలుమార్లు చర్చించాడు. ఎలాగైనా సయ్యద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న సింహాద్రి ఇందుకోసం అదే గ్రామానికి చెందిన తన స్నేహితులైన కందికంటి రజనీకాంత్, చందుపట్ల వెంకటేష్, చందుపట్ల వేణు, కందికంటి రాజశేఖర్, చందుపట్ల దిలీప్, చందుపట్ల మల్సూర్, ఏర్పుల భాను, చందుపట్ల ప్రదీప్, మందసాయిలతో కలసి పథకం వేశాడు. దీంతో ఈనెల 17న సాయంత్ర వేళ సయ్యద్ గ్రామంలోని బొడ్రాయి వద్ద ఉన్నాడని తెలుసుకున్న సింహాద్రి తన అనుచరులతో కలసి అక్కడి వెళ్లి ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో బొడ్రాయి వద్దనే నివాసగృహం ఉన్న జహంగీర్ సోదరుడు షేక్ లతీఫ్(43) తన అన్న కుమారుడు సయ్యద్‌పై యువకులు చేస్తున్న దాడిని చూసి అడ్డుకునేందుకు వెళ్లాడు. రాత్రిపూట గొడవ వద్దని, ఏమైనా వివాదం ఉంటే మరునాడు పరిష్కరించుకోవాలంటూ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఆగ్రహించిన సింహాద్రి అనుచరుల్లో ఒకరైన కందికంటి రజనీకాంత్ తమ వెంట తెచ్చుకున్న కత్తితో లతీఫ్ ఛాతిపై పొడవగా, కిందపడిపోయిన లతీఫ్‌పై మిగిలిన వారు భౌతిక దాడి చేసి చంపారు. హత్య జరిగిన నాటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. మృతుడి భార్య షేక్ ఉస్మాన్‌బేగం ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో బుధవారం ఉదయం కొత్తపేటలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మైనర్ నిందితులైన పొడేటి సింహాద్రి, ఏర్పుల భాను, చందుపట్ల ప్రదీప్, మందసాయిలతో పాటు కందికంటి రజనీకాంత్, చందుపట్ల వెంకటేష్, చందుపట్ల వేణు, కందికంటి రాజశేఖర్, చందుపట్ల దిలీప్, చందుపట్ల మల్సూర్‌లను అరెస్టు చేసి రిమాండ్ చేశామని డీఎస్పీ వివరించారు. ఈకేసులో ఏ–4 గా ఉన్న మరో నిందితుడు కత్తుల వీరయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించిన శాలిగౌరారం సీఐ నాగదుర్గ ప్రసాద్, కేతేపల్లి ఎస్‌ఐ బి.రామక్రిష్ణ, ఏఎస్‌ఐ గిరి, సిబ్బంది రాము, శ్రీరాములు, జానీలను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment